Begin typing your search above and press return to search.

ఎప్పుడొస్తాయో..? ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు

By:  Tupaki Desk   |   4 April 2020 1:30 PM GMT
ఎప్పుడొస్తాయో..? ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు
X
ముందే లోటు బడ్జెట్‌.. బోలెడు సంక్షేమ కార్యక్రమాల అమలు.. కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు లేవు.. ఇలాంటి సమయం లో లాక్‌ డౌన్‌ వంటి పిడుగు పడింది. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయమంతా ఆగిపోయింది. ఈ క్రమంలో ఉద్యోగులకు వేతనాలు, మాజీ ఉద్యోగులకు పింఛన్‌ లు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో లేదు. అందుకే ఈనెల 4వ తేదీ వచ్చినా ఇంకా వారికి జీతాలు, -పింఛన్‌ లు రాలేదు. ఏప్రిల్‌ 5వ తేదీ ఆదివారం.. దీంతో 6వ తేదీన జీతం, -పింఛన్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ జీతాలు - పింఛన్‌ లు చెల్లించేందుకు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. వేటికి కోత విధించి వీటిని చెల్లించాలోనని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత అధికారుల తో చర్చిస్తున్నారు.

అయితే దీన్ని నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం విభిన్నంగా ఆలోచించింది. రెండు విడతలుగా వేతనాలు - పింఛన్‌ లు అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే వీటి ద్వారా మరింత ఆలస్యమవుతుందని కొందరు అభిప్రాయపడడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు కొంత ఆర్థిక సహాయం విడుదల చేసింది. ఈ మేరకు ఆ నిధుల నుంచి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు - మాజీ ఉద్యోగులకు జీతాలు - పింఛన్లు చెల్లించే అవకాశం ఉంది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యం లో ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కొనసాగుతుండడం తో రాష్ట్రంలో ఆదాయ వనరులు పూర్తిగా తగ్గిపోయాయి. ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు కొనసాగడం లేదు. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు ఆగిపోయాయి. చిల్లర వర్తకం మినహా మార్కెట్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో ఆదాయం రాని పరిస్థితిలో ప్రభుత్వం జీతాలు చెల్లించలేని పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం తో వాటిని నుంచి చెల్లించే అవకాశం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ లో రాష్ట్రంలో కరోనాపై నివేదించడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించారు. కేంద్రం ఆదుకోవాలని విన్నవించారు. ఇది జరిగిన మూడు రోజులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి కొంత ఆర్థికంగా ఊరట లభించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రంలోపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు - పదవీ విమరణ పొందిన వారికి పింఛన్లు అందించే అవకాశం ఉంది.