Begin typing your search above and press return to search.

ఈ నెలకు జీతాల్లేవు...ఇంతే సంగతులు...?

By:  Tupaki Desk   |   26 Jan 2022 12:30 PM GMT
ఈ నెలకు జీతాల్లేవు...ఇంతే సంగతులు...?
X
కరోనా తరువాత ఏపీలో ఆర్ధిక పరిస్థితి దిగజారింది అని అంతా అంగీకరిస్తారు. అదే టైమ్ లో ఏపీలో ఉద్యోగులకు నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఒకటవ తారీఖునకు అంది చాలా రోజులే అవుతోంది. ఆ విధంగా కిందా మీద ప్రభుత్వం పడుతున్న వేళ కొత్త పీయార్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.

పాత పీయార్సీ ప్రకారమే తమకు జీతాలు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా పట్టుదలగానే ఉంది. కొత్త పీయార్సీ ప్రకారమే జీతాలు ఇస్తామని చెబుతోంది. ఆ మేరకు ప్రాసెస్ చేయాలని ఖజానా శాఖకు ఆర్ధిక శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే కొత్త పీయార్సీ మేరకు మేము ప్రాసెస్ చేయమని తెగేసి ఉద్యోగులు అక్కడ చెప్పేస్తున్నారు.

దీంతో ప్రతిష్టంబన ఏర్పడుతోంది. చూస్తే గట్టిగా నాలుగు రోజులు లేవు. కొత్త నెల వచ్చేస్తోంది. జీతాలు అందుతాయా లేదా అన్న అనుమానాలు కూడా ఉద్యోగులలో ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఈ నెలకు జీతాలు ఇవ్వకుండా చేయడానికే ఇలా చేస్తోంది అని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు. తమకు పాత పీయార్సీ మేరకే జీతాలు కావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం కొత్త పీయార్సీ జీతాలు అంటూ చర్చలకు పిలవడం ఏంటి అని మండిపడ్డారు. అయితే ఈ గొడవ ఎలా ఉన్నా జీతాలు మాత్రం ప్రాసెస్ కాకపోయ్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన నగదు మొత్తాలు అయితే ఈ నెలకు ఆగిపోయే అవకాశం అయితే ఉంది. దీంతో పాత పీయార్సీతోనే జీతాలు అందుకుని పూర్తి స్థాయి సమ్మెలోకి వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ సర్కార్ ఈ విధంగా గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది అంటున్నారు.

జీతాలు తీసుకోకుండా సమ్మెలోకి వెళ్తే ఆకలి కేకలతో ఎక్కువ రోజులు సమ్మె చేయలేరు అన్నది కూడా ఒక వ్యూహంగా ఉందని అంటున్నారు. మరో వైపు ప్రభుత్వానికి కూడా నెల జీతాలు కొన్ని రోజులు అయినా వాయిదా పడితే ఆర్ధికంగా ఎంతో కొంత వెసులుబాటుగా ఉంటుంది అంటున్నారు. మరి చూడాలి ఈ ఎత్తు పై ఎత్తులలో ఎవరు గెలుస్తారో. ఇంతకీ జీతాలు ఈ నెల పడతాయా అన్న ఆందోళన అయితే ఉద్యోగులతో పాటు పెన్షనర్లలో మొదలైపోయింది.