Begin typing your search above and press return to search.

ఎర్ర‌న్న శిష్యుడికి జ‌గ‌నన్న ప‌ల‌కరింపు !

By:  Tupaki Desk   |   27 Jun 2022 3:11 PM GMT
ఎర్ర‌న్న శిష్యుడికి జ‌గ‌నన్న ప‌ల‌కరింపు !
X
ఒక‌ప్పుడు ప‌సుపు కండువాల్లో మెరిసిన పలువురు నాయకులు తదనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకుని జ‌గ‌న్ పార్టీ మనుషులుగా మారిపోయారు. అటుపై వాళ్లంతా కాలానుగుణంగా మంచి ప‌దవులే అందుకున్నారు. కాలం గొప్ప‌ది క‌దా ! ఇప్పుడు ఒక‌నాడు ఆయ‌న‌పై కోపం అయి వ్యాఖ్య‌లు చేసిన బొత్స లాంటి లీడ‌ర్లు కూడా ఇప్పుడు ఆయ‌న వైపు త‌ప్ప‌క ఉంటున్నారు. ఆ క్ర‌మంలో కర‌డుగ‌ట్టిన ప‌సుపు చొక్కా నేత‌లు హాయిగా మా ఊళ్లో అంటే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వైపు తిరిగి, ప‌ద‌వులు అందుకున్నారు. ఆ క్ర‌మంలో కీల‌క నేత పిరియా సాయిరాజ్ ఒక‌రు. ఇంకా ఇంకొంద‌రు కూడా !

టీడీపీలో ఉన్నన్నాళ్లూ తిరుగులేని నేత.. ఎర్ర‌న్నాయుడు (దివంగ‌త నేత‌) కు ప్రియ శిష్యుడు. ఎక్క‌డో విశాఖ‌లో కాంట్రాక్ట్ వ‌ర్క్స్ చేసుకునే సాయిరాజ్ పిరియాకు పిలిచి ప‌ద‌వీ యోగం ద‌క్కించింది ఎర్ర‌న్న. ఆ విధంగా ఆయ‌న ఇప్ప‌టికీ ఓ విధంగా కింజ‌రాపు కుటుంబానికి విధేయుడు. ప‌రిస్థితులు మారేయి.. రోజులూ మారేయి..అనుకున్న విధంగా కాకుండా కొన్ని తిరోగామి సంద‌ర్భాలు కూడా వ‌చ్చాయి. ఈ రివ‌ర్స్ గేర్ టైమ్‌లో ఆయ‌న అనూహ్యంగా ఇచ్ఛాపురం వైసీపీ లీడ‌ర్ గామారిపోయారు. పార్టీకి పెద్ద‌దిక్కుగా ఉన్నారు.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో నిలిచి ఓడిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాత్రం ఇవాళ మంచి మార్కులు కొట్టేశారు. మూడో విడ‌త అమ్మ ఒడి ప్రారంభం సంద‌ర్భంగా సీఎం ఇక్క‌డికి వ‌చ్చారు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంగా ప‌ర్య‌ట‌న సాగించారు. ఒక‌రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అంద‌రి జిల్లా నేత‌ల‌నూ పేరుపేరునా ప‌ల‌క‌రించి దీవెన‌లు అందించి వెళ్లారు. పిరియా సాయి రాజు దంప‌తుల‌తో చాలా సేపు మాట్లాడారు. సాయి రాజ్ జీవ‌న స‌హ‌చ‌రి విజ‌య ఇప్పుడు ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లా జెడ్పీ చైర్మ‌న్ గా ఉన్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా కూడా సాయిరాజ్ కుటుంబానికి ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తూ వ‌చ్చారు. ఆ విధంగా ఆయ‌న ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ్డారు.

ఇవాళ సీఎం ప‌ర్య‌ట‌న‌లో చాలా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఎప్పుడూ ఎవ‌రికి వారే అన్న‌విధంగా ఉండే నేత‌లంతా వేదిక‌పై సంద‌డి చేశారు. శ్రీ‌కాకుళం న‌గ‌ర పార్టీ నాయ‌కులు కూడా ఒకేసారి అంత మంది వేదిక‌పై క‌నిపించి సీఎం ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాల‌ని తెగ త‌పన పడ్డారు. మొత్తానికి ఒక‌నాటి టీడీపీ నాయ‌కులు కొంద‌రు ఇటుగా వ‌చ్చి వైసీపీలో స్థిర‌ప‌డిపోగా, ఇప్ప‌టి వైసీపీ నేత‌లు త్వర‌లోనే టీడీపీకి హాయ్ చెప్పేందుకు సిద్ధం అయిపోతుండ‌డం ఇవాళ్టి వేళ కు ఉన్న విశేషం.