Begin typing your search above and press return to search.

చిరుపై సాయిరెడ్డి ప్ర‌శంస జ‌ల్లు.. రీజ‌నేంటబ్బా?!

By:  Tupaki Desk   |   26 Sep 2022 10:30 AM GMT
చిరుపై సాయిరెడ్డి ప్ర‌శంస జ‌ల్లు.. రీజ‌నేంటబ్బా?!
X
ఇదో చిత్ర‌మైన వ్య‌వ‌హారం. త‌న‌కు రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని.. ఒక‌ప్పుడు చేసిన రాజ‌కీయాలకు ఇప్పుడు తాను దూరంగా ఉన్నార‌ని.. మెగాస్టార్ చిరంజీవి చెబుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న తాను రాజీకాయ‌ల‌ను వ‌దిలేసినా.. రాజ‌కీయాలు మాత్రం త‌న‌ను వ‌దిలిపెట్ట‌డం లేదని ట్వీట్ చేశారు. ఇలాంటి స‌మ‌యంలో వైసీపీ నేత‌లు.. ఆయ‌న‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వానికి.. చిరుసోద‌రుడు.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమంటోంది. త‌రచుగా ప‌వ‌న్ .. వైసీపీ ప్ర‌భుత్వాన్ని.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను కూడా కార్న‌ర్ చేస్తున్నారు. కామెంట్లుకురిపిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా..ప‌వ‌న్‌ను అదేత‌ర‌హాలో విమ‌ర్శిస్తున్నారు. ద‌త్త‌పుత్రుడు అంటూ.. ఆట‌ప‌ట్టిస్తున్నారు. టీడీపీకి, ఆయ‌న‌కు సంబంధాన్ని అంట‌గ‌ట్టి.. ఆ పార్టీని గెలిపించ‌డం కోసం.. చంద్ర‌బాబును సీఎం చేయ‌డం కోస‌మే.. ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అంటున్నారు.

ఎక్క‌డ ఎలాంటి స‌భ జ‌రిగినా..ప‌వ‌న్‌కు.. చంద్ర‌బాబుకు ముడిపెట్టి ఏదో ఒక కామెంట్ చేయ‌కుండా.. జ‌గ‌న్ ఉండ‌డం లేదు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌నే ప్ర‌చారాన్ని కూడా చేస్తున్నారు.ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను ఆయ‌న అన్న‌, జ‌నసేన నాయ‌కుడు.. నాగ‌బాబుపైనా.. కామెంట్లు చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు కూడా.. వైసీపీ నేత‌ల‌పై కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ప‌వ‌న్ సోద‌రుడు.. మెగాస్టార్ చిరుకు వైసీపీ నాయ‌కులు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన ఇద్ద‌రు సోద‌రుల‌ను చిరుతో పోలుస్తూ.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. వైసీపీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..చిరంజీవి ప‌లుమార్లు ప్ర‌త్యేక విమానంలో తాడేప‌ల్లికి వ‌చ్చారు. జ‌గ‌న్‌తో క‌లిసి..భోజ‌నం కూడా చేశారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కూడా గుప్పించారు. అదేవిధంగా సినిమా స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్ప‌డు.. ఇండ‌స్ట్రీ ఉంచి కొంద‌రిని తీసుకువ‌చ్చి.. చ‌ర్చించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యేలా వ్యూహాత్మ‌కంగా చిరు వ్య‌వ‌హ‌రించారు.

ఈ క్ర‌మంలో రోజా స‌హాప‌లువురు చిరును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. అదేస‌మ‌యంలో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక సంద‌ర్భంలో చిరుకు రాజ్య‌స‌భ సీటు ఇస్తున్నార‌నే ప్ర‌చారాన్ని కూడా తీసుకువ‌చ్చారు. చిరంజీవి తన వైపు ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగించగలిగితే అది మెగా అభిమానులను జ‌న‌సేన పార్టీ వైపు ఆకర్షిస్తుందని, అది పవన్ కళ్యాణ్‌పై ప్రభావం చూపుతుందని వైఎస్సార్సీ నాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే సోమ‌వారం వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చిరుపై ప్ర‌శంస‌లు గుప్పిస్తూ.. ఒక ట్వీట్ చేశారు. గాడ్ ఫాద‌ర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆయ‌న ప్ర‌శంస‌లు గుప్పించారు. ఈ ఈవెంట్‌కు త‌న హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా.. తెలుగు సినీ ప్ర‌పంచంలో ధ్రువ తార‌గా చిరు వెలుగొందుతున్నార‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికీ అదే ఇమేజ్‌ను కొన‌సాగిస్తున్నార‌ని తెలిపారు. ఆయ‌న జీవితం అనేక మంది స్ఫూర్తినిస్తుంద‌ని తెలిపారు. అయితే.. విజ‌య‌సాయిరెడ్డి చేసిన కామెంట్లు ప‌రిశీలిస్తే.. చిరు.. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నార‌నే సంకేతాలు పంపిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి మెగా అభిమానులు ఏమంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.