Begin typing your search above and press return to search.

సాగర్ టికెట్ నోముల కొడుక్కి ఇవ్వట్లేదా?

By:  Tupaki Desk   |   7 March 2021 12:30 PM GMT
సాగర్ టికెట్ నోముల కొడుక్కి ఇవ్వట్లేదా?
X
తెలంగాణలో తిరుగులేదన్న స్థాయి నుంచి.. తన బలం ఎంతన్నది నిజంగానే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితికి దిగజారింది అధికార టీఆర్ఎస్. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు వరకు రాష్ట్రంలో తమ పార్టీకి ఎదురు లేదని..సమీప భవిష్యత్తులో తమను టచ్ చేసే వారే రారన్న మాట ఆత్మవిశ్వాసంతో వినిపించేది. కానీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బ పడటం.. తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ అంత ప్రభావం చూపించకపోవటంతో.. తమ వాస్తవ బలం ఏమిటన్న కన్ఫ్యూజన్ పార్టీ అధినాయకత్వానికే కాదు.. పార్టీలోని అన్ని క్యాడర్ లకు వ్యాపించిందని చెప్పాలి.

ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా.. నువ్వా నేనా? అన్నట్లు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత సీరియస్ గా ఈ ఎన్నికల్ని తీసుకుంది టీఆర్ఎస్. ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా.. పక్కా ప్లానింగ్ తో పాటు.. భారీ ఎత్తున ఖర్చుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ.. రెండు స్థానాలు గులాబీ కారు ఖాతాలో పడతాయా? అన్న ప్రశ్నకు అవునన్న సమాధానం రాని దుస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడుప్రశ్నగా మారింది. నోముల నర్సయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో ప్రకటిస్తారని చెబుతున్నారు. తొలుత ఈ స్థానం నుంచి నోముల కుమారుడు నోముల భగత్ కు పార్టీ టికెట్ ఇవ్వాలని భావించారు. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఏ మాత్రం రిస్కు తీసుకోకుండా.. బలమైన అభ్యర్థిని బరిలోకి దించి.. ఈ స్థానం కారు ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో అధికార పార్టీ ఉంది.

ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఈ నియోజకవర్గ పరిధిలోని పార్టీకి చెందిన ముగ్గురు నేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన వైనం ఇప్పుడు కొత్త సమీకరణాల దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్.. బీజేపీలు సీరియస్ గా తీసుకోవటమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లో తమ సత్తా చాటాలన్న తలంపుతో ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఉప ఎన్నికకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి.

ఇలాంటివేళలో.. మరింత అప్రమత్తత అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీల బలాలు.. బలహీనతలు.. వారికున్న ఆశావాహులు.. ఇతర అంశాల్ని చెక్ చేసుకొని అభ్యర్థిని డిసైడ్ చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో యాదవులే అభ్యర్థుల గెలుపును డిసైడ్ చేస్తారని.. నోముల నర్సయ్య సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారని చెబుతున్నారు. అయితే.. నోముల కుమారుడు ప్రస్తుతం జరిగే ఎన్నికకు సరిపోడని.. ఆయనకు వేరే అవకాశం ఇచ్చి.. మరొకరికి టికెట్ ఇవ్వటం మంచిదన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

మారిన పరిణామాలకు తగ్గట్లు కొన్ని కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి. మన్నె రంజిత్ యాదవ్.. పెద్దబోయిన శ్రీనివాస్..కట్టెబోయిన గురవయ్య యాదవ్ లతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. వీరికి నియోకవర్గంలో ఉన్నబలం.. గెలుపు అవకాశాల్ని సారు అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు అవసరమైన అన్ని అంశాన్ని లెక్కలోకి తీసుకున్నాకే.. అభ్యర్థిని కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు. చూస్తుంటే.. సాగర్ బరిలోకి గులాబీ పార్టీ తరఫున కొత్త కృష్ణుడి ఎంట్రీ ఖాయమన్నట్లే ఉందని చెబుతున్నారు.