Begin typing your search above and press return to search.

జాతీయ పార్టీ కోసం తెలంగాణానే త్యాగం ...?

By:  Tupaki Desk   |   5 Oct 2022 7:33 AM GMT
జాతీయ పార్టీ కోసం తెలంగాణానే త్యాగం ...?
X
సాహసం చేయరా డింబకా అని పాతాళభైరవిలో మాత్రికుడు అన్నాడు. కానీ దుస్సాహసం చేయమని ఎక్కడా అనలేదు. అది మంచిది కూడా కాదు. ముందు నేల మీద కాలు ఉంచాక ఆనక ఎన్ని విన్యాసాలు అయినా చేయవచ్చు. అదే కాలుని కదిపేసి ఉనికిని చెరిపేసి చేసే ప్రయత్నాన్ని దుస్సాహసం అనే ఎవరైనా అంటారు. కేసీయార్ కి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఒక చిరకాల కల. తీరని కోరిక.

దానికి ఆయన ఏదో ఒక కూటమిలో తన పార్టీని చేర్చి ఢిల్లీలో హాయిగా గడపవచ్చు. అవకాశం ఉండి ఆ కూటమి తెలిస్తే ఏ కేంద్ర మంత్రి పదవిని అయినా తీసుకోవచ్చు. కానీ కేసీయార్ మాత్రం అందరిలా ఆలోచించలేదు. తానే ఒక జాతీయ పార్టీని పెడితే పోలా అని అనుకున్నారు. దాంతో ఆయన్ని ఇంతవాడిని చేసిన తెలంగాణానే ఫణంగా పెట్టబోతున్నారు.

కేసీయార్ ముఖ్యమంత్రిత్వానికి ఆయన టీయారెస్ పార్టీకి ఆత్మ గా తెలంగాణా ఉంది. ఇపుడు అర్జంటుగా ఆ ఆత్మను లేకుండా చేసి అందులో భారత మాతను తీసుకునివచ్చారు. ఆ భారత మాత ఎంతవరకూ కరుణిస్తుందో తెలియదు కానీ ముందు తెలంగాణా తల్లి మాత్రం గులాబీ జెండా నుంచి మాయమైంది. ఇది సెంటిమెంట్. కేసీయార్ బాగా కలసి వచ్చిన సెంటిమెంట్. కర్ణుడికి కవచ కుండలాల మాదిరిగా కేసీయార్ ని తెలంగాణాను వేరు చేయలేనంతగా ముడిపడిపోయిన పేరు అది.

టీడీపీలో పదవి దక్కక భంగపాటుకు గురి అనేక ఇబ్బందులు పడుతున్న కేసీయార్ కి నాటి నుంచి రెండు దశాబ్దాలుగా దగ్గర తీసుకుని సాకింది తెలంగాణావే. ఎంతటి మహామహులైన వారు సైతం తెలంగాణా సెంటిమెంట్ ముందు బలాదూర్ అయ్యారంటే అది ఆ పేరుకు ఉన్న మహిమ అని చెప్పక తప్పదు. అంతే కాదు కేసీయార్ ఉద్యమం బలంగా సాగి రాష్ట్రం ఏర్పడింది అంటే దాని వెనక బలం తెలంగాణావే.

రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన సెంటిమెంట్ అది. ఇతర ప్రాంతాల వారు తెలంగాణాలో పార్టీ పెట్టినా సోదిలోకి లేకుండా కొట్టుకుపోవడానికి ఆ పేరే కారణం. జాతీయ పార్టీలు సైతం జాతకాలు తారు మారు చేసిన పేరు అది. అలాంటి తెలంగాణా పేరుని త్యాగం చేయడం అంటే దుస్సాహసమే. తాను ఇతర రాష్ట్రాలలోకి అడుగు పెట్టాలని కేసీయార్ తన పార్టీ పేరు మార్చేశారు.

అయితే వేరే చోట్ల ఆయనకు ఎంతవరకూ అవకాశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు కానీ తెలంగాణాలో మాత్రం ఇతర పార్టీలకు బాగా అవకాశం ఇచ్చేలా కేసీయార్ తాజా డెసిషన్ ఉంది అంటున్నారు. ఇక కేసీయార్ ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి మరీ కర్నాటక మాజీ సీఎం కుమార స్వామిని రప్పించారు తమిళనాడు నుంచి ఒక ప్రాంతీయ పార్టీ నేత పాల్గొన్నారు. వీరందరినీ భారీ ఖర్చు పెట్టి రప్పించారు. ఇక దేశమంతా తెలిసేలా తన పార్టీ ఆవిర్భావాన్ని చాటి చెప్పడం కోసం భారీ ఖర్చు చేస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీయారెస్ అన్న పేరుని శాశ్వతంగా చెరిపేసి కేసీయార్ చేస్తున్న ఈ ప్రయత్నం మాత్రం ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందో అన్న చర్చ అయితే ఉంది. కడుపులో చల్ల కదలకుండా ఉన్న చోటనే ఉంటూ ఉన్న పేరుతోనే జాతీయ రాజకీయం చేసుకునే వీలున్నా కేసీయార్ కొత్త పార్టీ అంటున్నారు. మరి వ్యూహకర్త అయిన కేసీయర్ కి ఇది ఏ మేరకు రాజకీయ లాభం తెచ్చిపెడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.