రోహిత్ కెప్టెన్సీ పై సచిన్ ఏమన్నాడంటే..

Sun Dec 05 2021 14:04:25 GMT+0530 (IST)

Sachin Tendulkar On Rohit Sharma Captaincy

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ..సహచర ఆటగాళ్ల గురించి అతడు మాట్లాడేది అతి తక్కువ. ఎప్పుడైనా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తేనో... మరీ దారుణంగా ఆడితేనే తప్ప సచిన్ స్పందించడు. అయినా.. రికార్డులకే రారాజయిన సచిన్ మాట్లాడేంత రికార్డులు ఏముంటాయి?తనకు అచ్చిరాని కెప్టెన్సీ
సచిన్ అంటే మెతక స్వభావం. వివాదాలకు సుదూరం. హుందాతనానికి పెట్టింది పేరు. వీటన్నిటికీ మించి అత్యద్భుత ప్రతిభ. 24 ఏళ్ల కెరీర్లో ఒకే విధమైన బ్యాటింగ్ స్థాయిని కొనసాగించడం అంటే మాటలు కాదు. ఎప్పుడైనా సచిన్ ఫామ్ కోల్పోయాడనే మాటే రాలేదు. కాకపోతే.. సెంచరీలు చేయలేకపోయేవాడు. 90 ల్లోనో  80 ల్లోనే ఔటయ్యేవాడు. అంతకుమించిన ఫెయిల్యూర్ ఉండకపోయేది. కానీ సచిన్ కెరీర్ ఆసాంతంలో అతిపెద్ద ఫెయిల్యూర్ కెప్టెన్సీ. మహమ్మద్ అజహరుద్దీన్ నుంచి సచిన్ కు సారథ్య బాధ్యతలు అప్పగించినప్పడు అద్భుతాలు చేస్తాడని భావించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. కెప్టెన్సీ భారం బ్యాటింగ్ పై పడకున్నా.. సచిన్ సారథిగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ సమయంలో జట్టు కూడా అతడిపై అతిగా ఆధారపడే పరిస్థితి. చివరకు స్వచ్ఛందంగా కెప్టెన్సీని వదులుకుని సచిన్ అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఆటగాడి ఆ తర్వాత మరో 15 ఏళ్లు కొనసాగాడు.

ముంబైకి ఆడినా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సచిన్ ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహించాడు. కొన్నేళ్లకు లీగ్ క్రికెట్ నుంచి కూడా తప్పుకొని ముంబైకి మార్గదర్శకం వహించాడు. అలాంటి సమయంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబైకి మారాడు. అప్పటినుంచి అతడు సొంతగడ్డ ముంబైతోనే ఉంటున్నాడు. కెప్టెన్ అయ్యాడు. ఐదు టైటిళ్లు అందించాడు. ఇప్పడు టీమిండియా టి20 కెప్టెన్ గానూ ఎదిగాడు. ఇదే సమయంలో వన్డే కెప్టెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అందరి మాట.. సచిన్ మాట
రోహిత్ కెప్టెన్సీపై అందరిదీ ఒకటే మాట. అతడిలో బ్యాటింగ్ ప్రతిభతో పాటు నాయకత్వ లక్షణాలూ మెండుగా ఉన్నాయని. ఇప్పుడు సాటి ముంబైకర్ సచిన్ టెండూల్కర్ కూడా అదే అన్నాడు. రోహిత్ మంచి నాయకుడని కొనియాడాడు. అతడిది స్మార్ట్ క్రికెటింగ్ బుర్ర అని .. దేనికీ భయపడడని.. ఒత్తడిని అధిగమిస్తూ జట్టును నడిపించే వ్యక్తని ప్రశంసించాడు. కెప్టెన్సీలో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని.. రోహిత్ చాలాసార్లు దీనిని నిరూపించాడని సచిన్ వ్యాఖ్యానించాడు. టీమిండియా వన్డే కెప్టెన్ గానూ రోహిత్ కు పగ్గాలిస్తారని వార్తలు వస్తున్న వేళ.. క్రికెట్ దేవుడు సచిన్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలకంటే మించినవి ఏముంటాయి?