కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ భారీ షాక్ బీజేపీతో చర్చలు?

Sun Jul 12 2020 20:00:00 GMT+0530 (IST)

Sachin Pilot shocks Congress, talks with BJP?

రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రూప్ రాజకీయాలు అంటే తొలుత గుర్తుకు వచ్చే పేరు కాంగ్రెస్. మధ్యప్రదేశ్ గుజరాత్‌లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన యువనేతలు జ్యోతిరాదిత్య సింధియా సచిన్ పైలట్‌లను కాంగ్రెస్ 'ముఖ్య' పదవుల నుండి పక్కన పెట్టడం వేడి రాజుకుంది. ఈ కారణంగా మధ్యప్రదేశ్‌లో సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో అధికారం కాంగ్రెస్ నుండి కమలం దక్కించుకుంది. రాజస్థాన్‌లోను పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన సచిన్‌ను పక్కన పెట్టి అశోక్ గెహ్లాట్‌కు సీఎం పదవి ఇవ్వడంతో చాన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు అది ఉబికి వచ్చింది. ఆయనకు డిప్యూటీతో సరిపెట్టారు.సచిన్ ఆయన వర్గం అసంతృప్తిని గుర్తించిన గెహ్లాట్.. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేస్తోందని నిన్న ఆరోపించారు. ఈ రోజు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సీఎం గెహ్లాట్ తనను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సచిన్ పైలట్ ఇదివరకే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సోనియా రాహుల్ గాంధీలకు వివరించేందుకు హస్తినకు వచ్చారు.

కానీ సచిన్ పైలట్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నట్లుగా గెహ్లాట్ ఆయన వర్గం నేతలు ఆరోపించారు. సచిన్‌తో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారని కొంతమంది 19 నుండి 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారని మరికొంతమంది చెబుతున్నారు. సోనియాను కలుసుకొని ముఖ్యమంత్రి గెహ్లాట్ తనను ఎలా పక్కన పెట్టారో ఫిర్యాదు చేయనున్నారు. అయితే సచిన్ బీజేపీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తనకు పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందని కమలం పార్టీ పెద్దల ముందు చెప్పారని సమాచారం. కరోనా లాక్ డౌన్‌కు ముందు నుండే పైలట్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు. అయితే సచిన్ పైలట్ పార్టీలోకి వచ్చినా సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. దీంతో ఆయననే కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.