Begin typing your search above and press return to search.

సుప్రీంకు పైల‌ట్ పంచాయ‌తీ...చివరి చాన్సిచ్చిన రాహుల్‌!

By:  Tupaki Desk   |   16 July 2020 10:30 AM GMT
సుప్రీంకు పైల‌ట్ పంచాయ‌తీ...చివరి చాన్సిచ్చిన రాహుల్‌!
X
రాజస్థాన్‌ కాంగ్రెస్ కుంప‌ట్ల ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగింది. పార్టీ విప్‌ ధిక్కరించిన సచిన్‌ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో తాను బీజేపీలో చేరటంలేదని గెహ్లాట్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బహిష్కరణకు గురైన యువనేత సచిన్‌ పైలట్‌ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్‌ గాంధీయే స్వయంగా రంగంలోకి దిగి పైలట్‌ కు సానుకూల సందేశం పంపారు. రెబెల్స్ ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని వెంటనే జైపూర్‌ కు వచ్చి కాంగ్రెస్‌ లో చేరి పోవాలని కాంగ్రెస్ యువ‌నేత‌కు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. మ‌రోవైపు పైల‌ట్ త‌న బెట్టు వీడ‌టం లేదు. తాజాగా ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత గెహ్లాట్‌ - ఏఐసీసీలోని ఆయన మిత్రులంతా ఒక్కటై త‌న మీద దాడి మొదలు పెట్టారని స‌చిన్ పైల‌ట్ వాపోయిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనేందుకు పోరాడుతూనే ఉన్నానని పేర్కొంటూ సీఎం గెహ్లాట్‌ పై త‌న‌కు కోపమేమీ లేదని అన్నారు. ఈ నేప‌థ్యంలో సచిన్‌ పై బహిరంగంగా విమర్శలు చేయరాదని హైకమాండ్‌ సీఎం గెహ్లాట్‌ కు హుకుం జారీచేసింది. పైలట్‌ కు కాంగ్రెస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని పార్టీ కార్యదర్శి రణ్‌ దీప్‌ సింగ్‌ సుర్జేవాలా అన్నారు.

అదే సమయంలో పైలట్ సైతం త‌న మార్కు ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతున్నారు. త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌పై స్పీకర్ జారీ చేసిన నోటీసులపై స‌చిన్ రగిలిపోతున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే స్పీకర్ నోటీసులు జారీ చేశారన్న వాదనతో ఆయన సుప్రీం మెట్లెక్కారు. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. ఆయ‌న త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాదులు హ‌రీశ్ సాల్వే - ముఖుల్ రోహ‌త్గీ వాదించ‌నున్నారు. మ‌రోవైపు స్పీక‌ర్ నోటీసుల‌పై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా క్లారిటీ తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా, కాంగ్రెస్‌ సంక్షోభంపై మొదట దూకుడుగా వ్యవహరించిన బీజేపీ తాజా పరిణామాలతో వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోంది.