రాజస్థాన్ సంక్షోభం: రాహుల్ గాంధీ పిలిచినా వెళ్లని సచిన్ పైలట్

Mon Jul 13 2020 09:00:13 GMT+0530 (IST)

Rajasthan Crisis: Sachin Pilot Not Responding For Rahul Gandhi

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనకు చెక్ పెట్టాలని భావిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఢిల్లీకి చేరుకోవడంతో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని వార్తలు వచ్చాయి. ఇరవై మంది వరకు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి దేశ రాజధాని చేరుకున్న పైలట్ ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని కలవాల్సి ఉంది. కానీ ఆ సమావేశం జరగలేదు. దీంతో ఏదో జరుగుతోందనే ఆందోళన కాంగీయుల్లో ప్రారంభమైంది.రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సచిన్ పైలట్ పాత్రనే ఎక్కువ. అధిష్టానం తనకు సీఎం పదవి ఇవ్వకపోవడంపై అప్పటికే అసంతృప్తితో ఉన్న పైలట్.. డిప్యూటీ సీఎంగా ఉన్న తనను గెహ్లాట్ తప్పించాలని చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ఐదున్నరకు తనను కలవాలని రాహుల్ అపాయింటుమెంట్ ఇచ్చారు. కానీ అధినేత పిలిచినా సచిన్ పైలట్ ముఖం చాటేశారని చెబుతున్నారు. దీంతో సచిన్ పైలట్ బీజేపీ వైపు వెళ్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం మేరకు సచిన్ పైలట్ 22 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వచ్చారు. వీరు తొలుత సీఎం గెహ్లాట్‌తో సమావేశాన్ని తప్పించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ పిలిచినా వెళ్ళలేదని తెలుస్తోంది. పైలట్‌తో వెళ్లినవారిలో ఎక్కువగా భరత్‌పుర్ జిల్లాకు చెందినవారు ఉన్నారు.

మరోవైపు అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రభుత్వానికి ఢోకా లేదని బీజేపీ కూల్చాలని చూస్తోందని కాంగ్రెస్ చెబుతుండటం గమనార్హం. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటు గెహ్లాట్ ఆయన వర్గం అటు పైలట్ వర్గంతో మాట్లాడుతున్నారు. రేపు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ రణ్‌దీప్ సుర్జేవాలా అజయ్ మాకెన్‌లు ఆగమేఘాల మీద జైపూర్ వెళ్లారు. రేపటి సమావేశంలో పాల్గొననున్నారు.