Begin typing your search above and press return to search.

ఫ్యాక్ష‌న్ గ‌డ‌ప‌లో సూప‌ర్ పోలీస్ !

By:  Tupaki Desk   |   25 Jun 2022 11:30 PM GMT
ఫ్యాక్ష‌న్ గ‌డ‌ప‌లో సూప‌ర్ పోలీస్ !
X
ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు ఎస్పీగా ప‌నిచేసిన సిద్ధార్థ్ కౌశ‌ల్ ఇప్పుడు క‌ర్నూలు జిల్లాకు వ‌చ్చారు. ఇక్క‌డి ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌పై ఉక్కుపాదం మోపుతాన‌ని అంటున్నారు. మొన్న‌టి అమ‌లాపురం అల్లర్ల‌ను నియంత్రించ‌డంలోనూ ఆయ‌నే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ రోజు అల్ల‌ర్ల‌ను నియంత్రించ‌డమే కాదు సంబంధిత వ్య‌క్తుల‌ను ప‌ట్టుకోవ‌డంలో కూడా చాకచ‌క్యం చూపించి, కేసు ను త్వ‌ర‌గానే ఛేదించ‌గ‌లిగారు. మ‌ళ్లీ కోన‌సీమ వాకిట ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని నెలకొల్పేందుకు ఎంతో కృషి చేశారు.

ఆ రోజు అల్ల‌ర్ల‌కు కార‌ణం అయిన వారిని ప‌ట్టుకోవ‌డ‌మే కాదు వారి త‌ల్లిదండ్రులతో కూడా ఆయ‌న మాట్లాడి ఉన్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత వాట్సాప్ గ్రూపుల‌ను ట్రేస్ చేయ‌డంలో కానీ కేసును ఎన‌లైజ్ చేయ‌డంలో కానీ ఆ ఎస్పీకి మంచి పేరు వ‌చ్చింది.

ఆయ‌న నేతృత్వంలో బృందాలు బాగా ప‌నిచేయ‌డంతో అటు గోదావ‌రి జిల్లాలే కాదు యావ‌త్ ఆంధ్రాలోనే ఆయ‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు క‌ర్నూలుకు ఎస్పీగా వెళ్లారు. రావ‌డం రావ‌డంతోనే ఇక్క‌డి ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌పై క‌న్నేసి ఉంచారు.

త‌న బృందంతో అప్పుడే ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌పై వివ‌రాలు సేక‌రించారు. గ‌తంలో గొడ‌వ‌లకు కార‌ణం అయి ఉంటే వారిని ముందుగానే నియంత్రించాల‌ని చెప్పారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కౌతాళం మండలంలోని కామవరాన్ని సందర్శించి, ఇక్క‌డ శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌పై ఆరా తీశారు.

ఈ ఏడాది జనవరిలో భూవివాదం నేపథ్యంలో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. వాటి కార‌ణంగా ఇక్క‌డ ఇద్ద‌రు చనిపోవ‌డంతో అప్ప‌టి నుంచి ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసు ద‌ర్యాప్తుతో పాటు నిఘా కూడా కొన‌సాగుతూనే ఉంది. ఆ రోజు కామవరంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో పల్లె నిద్రలో భాగంగా ముందుగా కామవరం గ్రామాన్ని ఎంపిక చేసుకున్న గురువారం రాత్రి ఆ ఊళ్లోనే నిద్రపోయారు అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ సూప‌ర్ పోలీస్ రాక‌తో స‌మ‌స్య సర్దుమ‌ణిగి పోతుంద‌ని, గొడ‌వ‌లు కూడా త‌గ్గుతాయి అని, శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య మ‌ళ్లీ మ‌ళ్లీ రాద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఎస్పీ కూడా ఇందుకు అనుగుణంగానే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.