Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలకు ఎర.. నందు లీలలెన్నో!

By:  Tupaki Desk   |   29 Nov 2022 7:30 AM GMT
ఎమ్మెల్యేలకు ఎర.. నందు లీలలెన్నో!
X
తెలంగాణలో ఎమ్మెల్యేలకు కొనుగోలుకు ఎర వేసిన కేసులో సిట్‌ విచారణలో రోజూ అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో కీలక పాత్ర పోషించిన నంద కుమార్‌ (నందు) లీలలు మామాలుగా లేవని తెలుస్తోంది.

తనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్నాయనీ.. నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేశాడని సమాచారం. అలాగే ఏ పని కావాలన్నా చేసిపెడతానంటూ పలువురి నుంచి భారీగా దండుకున్నాడని చెబుతున్నారు.

తాజాగా నందకుమార్‌ భార్య చిత్రలేఖ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సిట్‌ వేర్వేరుగా విచారించింది. ఇంతకుముందు విచారణకు ఒకసారి హాజరైన చిత్రలేఖ మరోసారి హాజరై సిట్‌ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు సమాచారం. గతంలో పలుమార్లు నిందితులు సింహయాజి, రామచంద్రభారతి తమ నివాసానికి వచ్చారని ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరితోపాటు ఢిల్లీ నుంచి ఇంకా ఎవరైనా వచ్చారా అనే ప్రశ్నకు గుర్తులేదంటూ చిత్రలేఖ సమాధానం దాటవేశారని తెలిసింది.

అదేవిధంగా కొన్ని సెల్‌ఫోన్లు పాడయ్యాయని.. మరికొన్ని కనిపించటం లేదని సిట్‌ అధికారులకు చిత్రలేఖ చెప్పినట్టు సమాచారం. కాగా నందకుమార్‌ తన వ్యాపార కార్యకలాపాలు, ప్రైవేటు పంచాయితీల లావాదేవీల ఛాటింగ్‌తో ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తన భార్య చిత్రలేఖ వాట్సప్‌ నంబర్‌కు షేర్‌ చేసేవాడు. ఈ నేపథ్యంలో వాటి గురించి కూడా చిత్రలేఖను సిట్‌ అధికారులు ఆరా తీశారు. నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తామంటూ ఎవరెవరిని ప్రలోభపెట్టారని సిట్‌ అధికారులు చిత్రలేఖను ప్రశ్నించారు.

మరోవైపు నందకుమార్‌తో ఛాటింగ్, బ్యాంకు లావాదేవీల వివరాలు దర్యాప్తులో వెలుగుచూడటంతో విజయ్‌కుమార్‌ను కూడా సిట్‌ విచారించింది. ఇప్పటికే అతడి నుంచి కొంత సమాచారం సేకరించగా.. తాజాగా మరిన్ని వివరాలు రాబట్టారు.

విజయ్‌కుమార్‌ గతంలో ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి వద్ద పనిచేశారని సమాచారం. అక్కడ పనిమానేశాక మరో జాతీయ పార్టీ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని అంటున్నారు. ఆ సమయంలోనే విజయ్‌కుమార్‌కు నందకుమార్‌తో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది.

జాతీయస్థాయిలో నామినేటెడ్‌ పదవి ఇప్పిస్తానంటూ విజయ్‌కుమార్‌కు ఆశ చూపిన నందకుమార్‌ అతడి నుంచి తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నందకుమార్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సిట్‌ విజయ్‌కుమార్‌ను ఆరా తీసింది.

నామినేటెడ్‌ పదవులపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారా? అక్కడ ఎవర్ని కలిశారు? వారు ఎలాంటి హామీలిచ్చారు? ఇంకా ఎంతమందికి నామినేటెడ్‌ పదవుల ఆశ చూపారనే అంశాలపై విజయ్‌కుమార్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.