Begin typing your search above and press return to search.

ఏంది సారూ? కేసీఆర్ చూస్తారని వీడియో తీసిన రైతు.. చూడలేదని సూసైడ్

By:  Tupaki Desk   |   26 Nov 2020 9:50 AM GMT
ఏంది సారూ? కేసీఆర్ చూస్తారని వీడియో తీసిన రైతు.. చూడలేదని సూసైడ్
X
అక్కడెక్కడో ప్రగతిభవన్ లోనో.. లేదంటే ఫాంహౌస్ లోనో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణలో ఏ మూల ఏం జరిగినా నిమిషాల మీద ఆయనకు సమాచారం అందుతున్న భరోసా చాలామందిలో ఉంటుంది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తమకు సంబంధించిన అంశం ఏది బయటకు వచ్చినా.. దాని గురించి సమాచారం ఇట్టే ముఖ్యమంత్రి వద్దకు చేరుకుంటుందన్న మాట పులువురి నోటి నుంచి వినిపిస్తుంటుంది. ఈ మాటల్ని నమ్మాడో ఏమో కానీ ఒక రైతు.. తాము ఎదుర్కొంటున్నకష్టాల్ని వీడియో తీశాడు.

‘సారూ దండం సారూ... కేసీఆర్‌ ముఖ్యమంత్రి గారూ... ఇగచూడు మా పరిస్థితులు వరిచేన్లు గిట్ల ఉన్నయ్‌.. వానపడి పంట కొట్టుకుపోయి ఆగమైనం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరే రైతులను కాపాడండి’ అంటూ వేడుకున్నాడు. తాను తీసిన వీడియోకు స్పందన కోసం వెయిట్ చేసిన ఆ రైతు.. ఇరవై రోజులు గడిచినా ఎవరూ పట్టించుకోకపోవటంతో పురుగులు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. యాదాద్రి జిల్లాకు చెందిన 56ఏళ్ల సామ కాంతిరెడ్డి విషాదం ఉదంతం ఇప్పుడు అందరిని కదిలించేస్తోంది.

వ్యవసాయాన్ని దండుగ కాదు.. పండుగ చేశానని చెప్పే ముఖ్యమంత్రి హయాంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం విషాదాన్ని నింపుతోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధీమా సంకేతాలు రాకపోవటంతో.. రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి.

తాజాగా ఒక్క బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు రైతులు తమ ప్రాణాల్ని తీసుకున్న వైనం చూస్తే.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న వాదన వినిపిస్తోంది. తమది రైతు ప్రభుత్వంగా చెప్పే సర్కారు.. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించటమే కాదు.. వారిలో ధీమా పెంచుతూ.. తాము ఉన్నామన్న భరోసాను కల్పించాల్సి ఉంటుంది. ఆ విషయంలోఏ మాత్రం ఫెయిల్ అయినా.. ఇలాంటి విషాద ఉదంతాలుచోటు చేసుకుంటాయన్నది మర్చిపోకూడదు.