ప్రపంచంలో మొట్టమొదటిది.. వజ్రం లోపల వజ్రం

Wed Oct 09 2019 15:51:33 GMT+0530 (IST)

Russian Mine Yields Diamond-Within-Diamond Stone

ఖనిజాల్లో వజ్రానికి మించింది మరొకటి లేదంటారు. మానవ పరిణామ క్రమంలో వీటి చుట్టూ తిరిగిన చరిత్ర అంతా ఇంతా కాదు. దీని కోసం ఎన్నెన్ని యుద్ధాలో జరిగాయి. ప్రపంచ చరిత్రను మార్చిన ఘన కొన్ని వజ్రాలకు ఉందని చెబుతుంటారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఎన్నో గనుల్లో మరెన్నో వజ్రాల్ని గుర్తించారు. వెలికితీశారు. నగిషీలు చెక్కి అమ్మేశారు. కానీ.. ప్రపంచంలో తొలిసారి ఒక భిన్నమైన వజ్రాన్ని తాజాగా గుర్తించారు.సాంకేతిక పరిభాషలో దీన్ని మాట్రియోష్కా అంటారు. ఇలాంటి పదాలకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. వజ్రం లోపల వజ్రమన్నమాట. ప్రపంచంలో ఇప్పటివరకూ ఎన్నో వజ్రాలు లభించినా.. ఈ తరహా వజ్రాన్ని మాత్రం తొలిసారి గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ అరుదైన వజ్రంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.

రష్యా పరిధిలోని సైబీరియాలోని ఒక గనిలో ఈ వజ్రం బయటపడినట్లు చెబుతున్నారు. అత్యంత అరుదైన ఈ వజ్రానికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం.. దీని వయసు. దాదాపు 80 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదిగా దీన్ని చెబుతున్నారు. ఈ వజ్రం ఎలా ఉందన్న విషయాన్ని రష్యా స్టేట్ మైనింగ్ కంపెనీ అల్రోసా వెల్లడించింది.

ఒక వజ్రం బయటపడింది. ఆ వజ్రం లోపల మరో బుల్లి వజ్రం. అది అటూ ఇటూ కదులుతోందని చెబుతున్నారు. ఈ వజ్రం బరువు 0.62 కేరట్లు కాగా.. వజ్రం లోపల ఉన్న బుల్లి వజ్రం బరువు 0.02 కేరట్లుగా అంచనా వేస్తున్నారు. సాధారణంగా వజ్రం లోపల ఖాళీ అన్నది ఉండదు. ఎందుకంటే ఏదో ఒక ఖనిజం అందులో చేరిపోతుంది. కానీ.. తాజాగా బయటపడిన వజ్రం మాత్రం అందుకు భిన్నంగా.. లోపలంతా ఖాళీగా ఉంది. పెద్ద వజ్రాన్ని కదుపుతుంటే.. లోపలి వజ్రం అటూ ఇటూ తిరుగుతూ అందరిని ఆకర్షిస్తోంది. దీని విలువ ఎంతన్న విషయం మీద మాత్రం సమాచారం బయటకు రాలేదు.