Begin typing your search above and press return to search.

ప్రపంచానికి గుడ్ న్యూస్: కొవిడ్ కు రష్యా వ్యాక్సిన్ ?

By:  Tupaki Desk   |   13 July 2020 5:00 AM GMT
ప్రపంచానికి గుడ్ న్యూస్: కొవిడ్ కు రష్యా వ్యాక్సిన్ ?
X
కొన్ని దేశాల్లో అసలేం జరుగుతుందో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటి దేశాల జాబితాలోకి వస్తుంది రష్యా. వాద్లిమిర్ పుతిన అధ్యక్ష పాలనలో ఆ దేశంలో చోటు చేసుకునే పరిణామాలు గుట్టుచప్పుడు కాకుండా ఉంటాయి. మిగిలిన దేశాల మాదిరి హడావుడికి దూరంగా ఉండే ఆ దేశం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. యావత్ ప్రపంచం తన వైపు చూసేలా చేసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ పీచమణిచే వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది.

కరోనా వ్యాక్సిన్ మీద ప్రయోగాలు పూర్తి అయ్యాయని ప్రకటించింది. క్లీనికల్ టెస్టులు పూర్తి చేసుకున్న తొలి టీకా తమదేనని రష్యాలోని సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ వర్సిటీ ప్రకటించింది. మిగిలిన ప్రయోగాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేయగా.. రష్యా మాత్రం అలాంటి ప్రచారాలకు దూరంగా ఉందన్న మాట వినిపిస్తోంది. నిన్నటి వరకూ వ్యాక్సిన్ తయారు చేసే దేశాలు.. సంస్థల విషయంలో ప్రస్తావన రాని మాస్కో వర్సిటీ.. మిగిలిన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసేలా తాజా ప్రకటన ఉందని చెప్పాలి.

క్లీనికల్ ప్రయోగాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది. క్లీనికల్ ట్రయల్స్ లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల టీంను బుధవారం డిశ్చార్జి చేయగా.. రెండో టీంను ఈ నెల ఇరవైన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది రష్యాలోని గమేలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మెక్రోబయాలజీ డెవలప్ చేసిన ఈ ప్రయోగాత్మక టీకాపై వర్సిటీ టెస్టుల్ని నిర్వహించింది.

జూన్ 18న ఈ పరీక్షలు ప్రారంభించినట్లుగా పేర్కొంది. దాదాపు నెలకు కాస్త ముందుగా స్టార్ట్ అయిన ఈ పరీక్షల మీద ప్రపంచ మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోవటం గమనార్హం. తాజాగా తాము రూపొందించిన వ్యాక్సిన్ సురక్షితమేనని.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర టీకాల స్థాయిలోనే ఇది సేఫ్ గా ఉందని సెచెనోవ్ వర్సిటీకి చెందిన అలెగ్జాండర్ లుకాషెవ్ వెల్లడించారు. రష్యా ప్రకటన ప్రపంచానికి తీపికబురుగా మారగా.. ప్రయోగం.. ఫలితాల విడుదల వరకూ రేసులో లేనట్లుగా కనిపించిన ఆ దేశం ఇప్పుడు వ్యాక్సిన్ విజేతగా నిలవనుందా? అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏమైనా.. ప్రచార ఆర్భాటం లేకుండానే వ్యాక్సిన్ రిలీజ్ వరకూ వచ్చేయటం మాత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పకతప్పదు.