పెదరాయుడికి చాన్స్... ?

Sun Jan 16 2022 16:40:56 GMT+0530 (IST)

Rumors On Rajya Sabha Seat

ఏపీ రాజకీయాల్లో టాలీవుడ్ ఇపుడు కీలకమైన పాత్ర పోషిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నాకు రాజకీయాలు వద్దు అంటున్నా ఆయన చుట్టూనే రాజకీయం గిర్రున తిరుగుతోంది. ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీ పెట్టి బిజీగా పాలిటిక్స్ చేస్తున్నారు. మరో వైపు చూస్తే పెదరాయుడు మోహన్ బాబు మాజీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. ఆయన సీనియర్ మోస్ట్ హీరో అయినా ఒకే ఒకసారి ఎంపీ అయ్యారు. అది కూడా ఎంటీయార్ టైమ్ లోనే. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో బీజేపీకి వైసీపీకి మద్దతు ఇచ్చినా కూడా అనుకున్న పదవులు రాలేదు.ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 21న ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు. వారిలో సిట్టింగ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉండగా మిగిలిన ముగ్గురూ బీజేపీకి చెందిన వారే. విజయసాయిరెడ్డికి రెండవమారు రెన్యూవల్ ఉంటుంది అని అంతా అంటున్నారు. దాంతో మూడు సీట్ల కోసం టాప్ రేంజిలో పోటీ సాగుతోంది. ఇక ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి జగన్ ఇంటికి వెళ్ళారు. దాంతో రాజ్యసభ సీటు ఆయనకు జగన్ ఆఫర్ చేశారంటూ వార్తా కధనాలు గుప్పుమన్నాయి.

ఇలా ఎక్కడ నుంచి పుట్టిందో కానీ ఆ మాట దావానలంగా వ్యాపించింది. దీని మీద ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తూ పోతున్నారు. స్వయంగా చిరంజీవి ఖండించినా కూడా దీనికి ఎండింగ్ లేకుండా పోతోంది. ఇవన్నీ ఇలా ఉండగా అసలు రాజ్యసభ మీద ఆశలు పెట్టుకున్న సినీ ప్రముఖుడు మంచు మోహన్ బాబు సంగతేంటి  అన్న చర్చ కూడా ఇదే టైమ్ లో వస్తోంది.

మోహన్ బాబు 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం  చేసి పెట్టారు. ఆ తరువాత ఒక సారి రాజ్యసభ సీట్ల భర్తీ 2020లో జరిగింది. నాడు నాలుగు పోస్టులు వస్తే ఆ నాలుగూ కూడా వైసీపీ ఇద్దరు మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ అయోధ్య రామిరెడ్డిలతో పాటు గుజరాత్ కి చెందిన పారిశ్రామికవేత పరిమళ్ నత్వానీకి ఇచ్చింది.

అప్పట్లోనే మోహన్ బాబుకు చాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇపుడు చూస్తే సినీ రంగాన రాజ్యసభ ఆఫర్ కి  మెగాస్టార్ పేరు వినిపించింది కానీ మోహన్ బాబు ఊసు ఎక్కడా లేదు. ఇక మోహన్ బాబు అయితే జగన్ కి దగ్గర బంధువుగా ఉన్నారు. పైగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన కుమారుడు విష్ణు ఉన్నారు. వారిని సినిమా పరిశ్రమ సమస్యల మీద  చర్చలకు పిలవకుండా చిరంజీవికి సినీ పెద్దగా జగన్ పిలవడం పట్ల మంచు ఫ్యామిలీ గుస్సాగా ఉందని అంటున్నారు.

ఇక రాజ్యసభ ఆఫర్ మెగాస్టార్ కి చేశారు అంటూ వస్తున్న వార్తలు కూడా పెదరాయుడు అభిమానులను కలవరపడుతున్నాయిట. దాంతో ఈసారి అయినా మోహన్ బాబుకు రాజ్యసభ సీటు వస్తుందా అన్నది ఒక చర్చగా మారిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మోహన్ బాబు ఇంతవరకూ జగన్ సీఎం అయ్యాక కలవలేదు. ఆ మధ్యన విజయవాడ వచ్చిన మోహన్ బాబు జగన్ తో భేటీ అవుతారు అని ప్రచారం జరిగినా ఎందుకో అది కుదరలేదు.

దాంతో మోహన్ బాబు కోరుకుంటున్న రాజ్యసభ సీటుని జగన్ ఇస్తారా అన్నది కూడా చూడాలి అంటున్నారు. ఏది ఏమైనా రాజ్యసభ సీట్ల విషయంలో వైసీపీలోనే చాలా పెద్ద పోటీ ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో సినీ పరిశ్రమకు కోటా పెట్టి  మోహన్ బాబుకు ఎంపీ సీటు ఇస్తే కనుక అది అద్భుతమే అవుతుంది. మరి జరుగుతుందా. ఏమో రాజకీయాల్లో ఏదినా సాధ్యమే కాబట్టి చూడాల్సిందే.