జగన్ ఆ ఒక్క హామీ నిలబెట్టుకుంటే..విపక్షాలకూ దేవుడే!

Sun Sep 20 2020 05:00:05 GMT+0530 (IST)

If Jagan keeps that one promise .. God for Opposition!

గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎన్ని కష్టాలు ఎదురైనా అమలు చేస్తున్నారు సీఎం జగన్. రైతుల నుంచి మహిళల వరకు చేతి వృత్తిదారుల నుంచి ఆటోరంగం వరకు అన్ని వర్గాలకు ఆయన ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయా వర్గాలకు గతంలో జరగని మేలు కూడా జరుగుతోందనే టాక్. దీంతో పేదలు మహిళలు జగన్‌ను దేవుడితో సమానంగా బావిస్తున్నారనేది కూడా నిజమే. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన మరో కీలక హామీ కూడా అమలు చేస్తే..  ప్రతిపక్షానికి కూడా జగన్ దేవుడు అయిపోతారని అంటున్నారు వైసీపీ నాయకులు.ప్రజలకు  వివిధ రూపాల్లో నిధులు ఇస్తున్న జగన్.. నియోజకవర్గాల అభివృద్ధి విషయంలోనూ నిధులు ఇస్తే.. ఇక ఆయనకు తిరుగులేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు. ``నియోజకవర్గాలను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. దీనికి కూడా నాడు-నేడు ఫార్ములాను ఆపాదిస్తాం. ప్రతి ఎమ్మెల్యేకు అభివృద్ధి నిధుల కింద ఏటా కోటి రూపాయలు ఇస్తాం`` అని.. సీఎం జగన్  తొలి అసెంబ్లీ భేటీలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  అంతేకాదు ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం చంద్రబాబుకు కూడా నియోజకవర్గం అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పిన విషయాన్ని చెబుతున్నారు.  

ఈ నేపథ్యంలో.. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం  నియోజకవర్గాల్లో పనులు కావడం లేదు. ఈ పరిణామం తమకు ఇబ్బందికరంగా ఉందని నేతలు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు. ఇటీవల మంత్రి శంకరనారాయణ తన సొంత నియోజకవర్గం అనంతపురంలోని పెనుకొండలో పర్యటించినప్పుడు అక్కడి రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హంద్రీనీవా జలాలను మడకశిర చెరువులకు తరలిస్తానని చెప్పిన మాటేమైందని వారు ప్రశ్నించారు. దీనికి ఆయన ఏం చెప్పాలో తెలియక తడబడ్డారు.

ఇక రోడ్ల అభివృద్ధిపైనా వ్యాపార వర్గాలు ఆయనను నిలదీశాయి. ఇలాంటి పరిణామాలు ఒక్క శంకరనారాయణకే కాదు.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నాయనేది వైసీపీ నేతల టాక్. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన హామీ నిలబెట్టుకుని నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వని రీతిలో కోటి రూపాయల ఇవ్వడం ద్వారా విపక్ష ఎమ్మెల్యేలకు కూడా కళ్లు తెరిపించాలని ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.