Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన టోల్ వసూళ్లు.. తెలంగాణలో రోజుకు రూ.4కోట్లు

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:38 AM GMT
హాట్ టాపిక్ గా మారిన టోల్ వసూళ్లు.. తెలంగాణలో రోజుకు రూ.4కోట్లు
X
కొత్తగా తెర మీదకు వచ్చిన జాతీయ విధానం కాసుల పండగగా మారింది. ఇంతకాలం జరుగుతున్న మోసం ఎంతన్న విషయం బయటకు వచ్చింది. జాతీయస్థాయిలో జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాహనాలు ఏవైనా ఆన్ లైన్ చెల్లింపులు జరిపేలా ఫాస్టాగ్ ను అందుబాటులోకి తీసుకురావటం తెలిసిందే. దీంతో.. నూటికి 95 నుంచి 98 శాతం మంది ఫాస్టాగ్ తోనే చెల్లింపులు జరుపుతున్న పద్దతి. పాత విధానంలో టోల్ గేట్ల వద్ద వాహనాలు చెల్లించాల్సిన టోల్ ఛార్జీలను మాన్యువల్ గా చెల్లింపులు జరిపేవారు. దీని కారణం.. వాహనాల సంఖ్య భారీగా కనిపించినా.. ఆదాయం మాత్రం పెద్దగా ఉండేది కాదు.

ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో టోల్ చెల్లింపులు ఏమైనా సరే.. ఫాస్టాగ్ ద్వారానే చెల్లించాలన్న నియమాన్ని పెట్టారు. దీంతో.. అత్యధిక భాగం చెల్లింపులు ఫాస్టాగ్ లోనే జరుగుతున్నాయి. దీని కారణంగా ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం భారీగా పెరగటమే కాదు.. అనవసరమైన రద్దీ తగ్గిపోతోంది. గతంలో టోల్ ఫ్లాజాల వద్ద వాహనాలు బారులు తీరేవి. వీటి కారణంగా ప్రయాణ సమయం పెరిగిపోతుండేది. కొత్తగా తీసుకొచ్చిన ఫాస్టాగ్ విధానంలో ఆశ్చర్యపోయే విధంగా ఆదాయం వస్తున్న వైనాన్ని గుర్తించారు.

ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 టోల్ వసూలు కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి గతంలో కోటి నుంచి రూ.2కోట్ల ఆదాయం రావటమే గగనంగా ఉండేది. టోల్ కేంద్రాల దగ్గర వాహనాలు కనిపించినా.. వాటి ఆదాయం మాత్రం కనిపించేది కాదు. అందుకుభిన్నంగా కొత్తగా వచ్చిన ఫాస్టాగ్ పుణ్యమా అని.. ఆదాయం భారీగా పెరిగినట్లుగా గుర్తించారు. తాజా లెక్కల ప్రకారం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రోజుకు టోల్ వసూళ్లు రూ.3.5కోట్ల నుంచి రూ.4.5 కోట్ల మధ్యగా వస్తున్నాయి. ఇంతకాలం దీనిలో సగం మాత్రమే వసూలైనట్లుగా లెక్కలు చూపించేవారు.

ఈ లెక్కన జాతీయస్థాయిలో టోల్ ఆదాయం భారీగా పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒక్క తెలంగాణలోనే.. టోల్ మీద నెలకు ప్రజలు చెల్లిస్తున్న పన్ను రూ.120 కోట్లుగా ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో మొత్తం టోల్ వసూళ్లు భారీగా పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.