ఏడు రోజులకు బిర్యానీకి రూ.27లక్షల బిల్లు..

Wed Sep 22 2021 17:00:02 GMT+0530 (IST)

Rs 27 lakh bill for biryani for seven days

దశాబ్ధం క్రితం పాకిస్తాన్ లో పర్యటించిన శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఐదారుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బతుకుజీవుడా అంటూ శ్రీలంక క్రికెటర్లు బతికిబయటపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదంతో అస్థిరంగా ఉన్న పాకిస్తాన్ లో ఏ ఒక్క అంతర్జాతీయ జట్టు పర్యటించలేదు. ఆయా దేశాలు అడుగుపెట్టడానికి సాహసించడం లేదు.కానీ ఇటీవలే న్యూజిలాండ్ బోర్డు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఈరోజు మ్యాచ్ ప్రారంభం సందర్భంగా బాంబు బెదిరింపులు రావడంతో క్రికెటర్లు హోటల్ కే పరిమితమయ్యారు. అనంతరం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని వెంటనే సొంత దేశానికి వెళ్లిపోయి షాకిచ్చింది. పాకిస్తాన్ ప్రధాని రంగంలోకి దిగి న్యూజిలాండ్ ప్రధానితో మాట్లాడినా కూడా ఫలించలేదు. న్యూజిలాండ్ బోర్డు పర్యటన రద్దు చేసుకోవడంతో పాక్ క్రికెట్ ప్రతిష్ట మసకబారింది. పాక్ క్రికెట్ బోర్డు నష్టాల్లో మునిగిపోయింది.

న్యూజిలాండ్ బోర్డు చివరి నిమిషంలో పర్యటనను క్యాన్సిల్ చేసుకోవడంతో పాక్ క్రికెట్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బందోబస్తు కోసం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అంతేకాదు బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వీరందరినీ న్యూజిలాండ్ జట్టు బస చేస్తున్న హోటల్స్ వద్ద బందోబస్తు కు ఏర్పాటు చేసింది.

అయితే వచ్చి వారం రోజులు పాకిస్తాన్ లో ఉన్న న్యూజిలాండ్ జట్టు అర్థాంతరంగా పర్యటన రద్దు చేసుకొని వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈ పర్యటనకు పెట్టిన ఖర్చులు చూసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోరెళ్లబెట్టింది.

భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసులకు ఏడురోజుల పాటు బిర్యానీ కోసం ఏకంగా రూ.27 లక్షలు ఖర్చు అయ్యిందట.. ప్రతీరోజు రెండు సార్లు పోలీసులకు బిర్యానీ పెట్టామని.. దానికి రూ.27 లక్షల ఖర్చు అయ్యిందని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ప్రస్తుతం ఈ బిల్లును బోర్డు పెండింగ్ లో పెట్టడంతో హోటల్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. తమ బిల్లులు వెంటనే చెల్లించాలని పాక్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేస్తున్నారు.