Begin typing your search above and press return to search.

ఒక్క ఇంజెక్ష‌న్‌ రూ.16 కోట్లు.. ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   19 Jun 2021 6:30 AM GMT
ఒక్క ఇంజెక్ష‌న్‌ రూ.16 కోట్లు.. ఎందుకంటే..?
X
జ్వ‌రం వస్తే ఊళ్లో ఆర్ఎంపీ ఇచ్చే 50 రూపాయ‌ల‌ ఇంజెక్షన్ మొద‌లు.. క‌రోనా ట్రీట్మెంట్లో నిన్నామొన్న‌టి వ‌ర‌కు కీల‌కంగా భావించిన రెమ్ డెసివ‌ర్ వ‌ర‌కు తెలుసు. దీన్ని బ్లాక్ లో రూ. 30 వేల నుంచి 40 వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేసి కొనుగోలుచేయ‌డం కూడా తెలుసు. కానీ.. ఒక్క ఇంజెక్ష‌న్ రూ.16 కోట్ల విలువైంద‌ని తెలుసుకున్న‌ప్పుడు నోరెళ్ల బెట్ట‌ని వారు లేరు. ఒక్క సూది మందుకు ఇన్ని డ‌బ్బులా? అని నిర్ఘాంతపోనివారు కూడా లేరు! ఏంటీ మందు స్పెషాలిటీ? అన్ని కోట్లు పోసి కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌న్న‌ది స‌హ‌జంగానే ఆస‌క్తిక‌రం. ఆ వివ‌రాలేంటో చూద్దాం...

హైద‌రాబాద్ కు చెందిన యోగేష్ గుప్తా కుమారుడైన రెండేళ్ల‌ బాలుడు అయాన్ష్ కు ఈ మందు అందించారు. జ‌న్మించిన ఆర్నెల్ల త‌ర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన బాబును ఆసుప‌త్రికి తీసుకెళ్తే.. ‘స్పైనల్మస్క్యులర్ ఆట్రోఫీ’ అనే అరుదైన వ్యాధిగా తేల్చారు వైద్యులు. ఈ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డడం ఒకే ఒక్క మందు వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది. అది కేవ‌లం అమెరికాలోనే దొరుకుతుంది. ఇక దాని ధ‌ర రూ.16 కోట్లు! కేంద్ర ప్ర‌భుత్వానికి జీఎస్టీ, ఇత‌ర‌త్రా దిగుమ‌తి సుంకాలు మ‌రో రూ.6 కోట్లు ఖ‌ర్చ‌వుతాయి. ఇంత ఖ‌రీదైన మందును దాత‌ల స‌హాయంతో తెప్పించారు. ఆ చిన్నారికి వేయించారు. ఇప్పుడు ఆ బాలుడు ఆరోగ్యంగా ఆడుకుంటున్నాడు.

ఈ వ్యాధి అత్యంత అరుదైన‌ది. ల‌క్ష‌లో ఒకరికి వ‌చ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వ‌చ్చిన‌వారి వెన్నుముఖ‌పై తీవ్ర ప్ర‌బావం ఉంటుంది. నిల‌బ‌డ‌డం.. న‌డ‌వ‌డం అనే మాట అటుంచితే.. క‌నీసం కూర్చోలేరు. ఈ ప‌రిస్థితి దీర్ఘకాలం కొన‌సాగితే.. మ‌ర‌ణం సంభ‌విస్తుంది. ఈ వ్యాధిలోనూ 4 ర‌కాలు ఉంటాయి. మూడు, నాలుగు ర‌కాల్లో ప్రాణాపాయం ఉండ‌క‌పోవ‌చ్చుగానీ.. జీవశ్చ‌వ‌మే. కూర్చోలేరు, మెడ కూడా పైకెత్త‌లేరు. ప‌డుకోవ‌డం కూడా స‌రిగా చేయ‌లేరు. ఇక‌, టైప్ 1, 2 ర‌కాల్లో ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంటుంది. ప్రాణాపాయం సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది.

శ‌రీరంలోని నాడులు క్ర‌మ క్ర‌మంగా క్షీణిస్తుంటాయి. కండ‌రాలు బ‌ల‌హీన‌మ‌వుతూ వ‌స్తాయి. శ‌రీరంలోని అవ‌య‌వాల‌న్నీ బ‌ల‌హీనం అయిపోతాయి. క్ర‌మంగా ప‌క్ష‌వాతం బారిన ప‌డ‌తారు. ఊపిరితిత్తులు దెబ్బ‌తింటూ ఉంటాయి. శ్వాస స‌మ‌స్య‌లు అధికం అవుతాయి. ద‌శ‌ల వారీగా తీవ్ర‌త ఎక్కువైపోయి ప్రాణాలు కోల్పోతారు. ఇదీ.. ఈ వ్యాధి ల‌క్షణం. గ‌తంలో ఈ రోగానికి మందులేదు. వ‌చ్చిందంటే.. ప్రాణాలు కోల్పోవ‌డ‌మే. కానీ.. ఇంత‌టి భ‌యంక‌ర‌మైన వ్యాధికి అమెరికాలో మందు త‌యారైంది. ప్రాణాల‌ను హ‌రించే రోగాన్ని త‌న్ని త‌రిమేసే అద్భుతాన్ని చేసి చూపిస్తోందని ఈ మందును ‘వండర్ డ్రగ్’ అని పిలుస్తున్నారు.

ఈ మందు పేరు Onasemnogene abeparvovec. అయితే.. దీన్ని Zolgensma అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్ర‌యిస్తున్నారు. అమెరికాకు చెందిన బ‌యోటెక్నాల‌జీ స్టార్ట‌ప్ అవెక్సిస్ దీన్ని త‌యారు చేసింది. Spinraza అనే మ‌రో మందుకూడా ఉన్న‌ప్ప‌టికీ.. అది పూర్తిస్థాయిలో ప్ర‌భావం చూపించ‌ట్లేదు. దీంతో.. Zolgensma బ్రాండ్ నే వినియోగిస్తున్నారు. ఈ మందు ధ‌ర‌ను 1.79 మిలియ‌న్ యూరోలుగా నిర్ణ‌యించారు. మ‌న క‌రెన్సీలో 16 కోట్ల రూపాయ‌లు. దీనికి జీఎస్టీ, ఇత‌ర ప‌నులు క‌లిపితే మ‌రో 6 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది. అంటే.. మొత్తంగా 22 కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.

దీన్ని ఒక‌సారి ఇంజెక్ట్ చేస్తే.. పిల్ల‌లు క్ర‌మంగా కోలుకుంటారు. ఈ మందును న‌రానికి ఇస్తారు. మొత్తం నాలుగు టైపులుగా ఉన్న వ్యాధినీ నిర్మూలిస్తుంది. క్ర‌మంగా దేహం విక‌సించ‌డం మొద‌లు పెడుతుంద‌ని, త‌ద్వారా ప్రాణాపాయాన్ని అధిగ‌మిస్తార‌ని, ఆరోగ్యంతో జీవిస్తార‌ని వైద్యులు చెబుతున్నారు. ఇదీ.. ఈ మందు ఘ‌న‌త‌. అన్నీ బాగానే ఉన్నాయిగానీ.. ధ‌రే మోయ‌లేనంత‌గా ఉంది క‌దూ! ఏం చేస్తాం.. ఆరోగ్యాన్ని మించిన వ్యాపారం ప్ర‌పంచంలోనే లేదు క‌దా!