Begin typing your search above and press return to search.

అత్యధిక సంతానం ఉన్నవారికి రూ.1 లక్ష నజరానా: మిజోరం మంత్రి

By:  Tupaki Desk   |   22 Jun 2021 9:30 AM GMT
అత్యధిక సంతానం ఉన్నవారికి రూ.1 లక్ష నజరానా: మిజోరం మంత్రి
X
మనదేశం జనాభా రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. భారీగా పెరుగుతోన్న జనాభా కారణంగా దేశ ఆర్థిక అవసరాలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తోంది. ఈ సమయంలో పలు రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పాలసీలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, ఈశాన్య రాష్ట్రం మిజోరం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు.

దీనితో ఇప్పుడు ఆ మంత్రి ప్రకటన స్థానికంగా సంచలనంగా మారింది. మిజోరంకి పోరుగున్న ఉన్న అస్సాం, జనాభా నియంత్రణలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని ప్రకటించింది. ఇక ఈమధ్యే మరో జీవో విడుదల చేసింది. ఇద్దరు సంతానం లోపు ఉన్న కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాల లబ్ధి దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి హిమాంత బిస్వా ప్రకటన చేశారు కూడా. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే, మిజోరం మినిస్టర్ స్టేట్ మెంట్ ను కౌంటర్ ఇచ్చాడంటూ కథనాలు వెలువడ్డాయి.

అయితే అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు మంత్రి రాబర్ట్. మిజోరాం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభాలేదు. మిజోలు లాంటి చిన్న చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది’’ అని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు. ఫాదర్స్ డే నాడు సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల్లో ఎవరోఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. లబ్ధిదారుడికి నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారు. గరిష్టంగా, కనిష్టంగా ఎంత మంది పిల్లలు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన ఖర్చును మంత్రి తనయుడి ఆధ్వర్యంలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ భరిస్తుందని తెలుస్తోంది.