Begin typing your search above and press return to search.

గృహహింస కేసు: కన్నా లక్ష్మీనారాయణ కోడలికి రూ.కోటి పరిహారం

By:  Tupaki Desk   |   20 Jan 2022 4:30 AM GMT
గృహహింస కేసు: కన్నా లక్ష్మీనారాయణ కోడలికి రూ.కోటి పరిహారం
X
గృహ హింస కేసులో మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలికి రూ. కోటి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కన్నా ఫ్యామిలీకి గట్టి షాక్ ఇచ్చింది. కన్నా కోడలు వేసిన కేసులో విజయవాడ కోర్టు ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది.

కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు, తన మేనమామ కూతురు శ్రీలక్ష్మీ కీర్తిని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2013లో కుమార్తె కౌషిక మానస జన్మించింది. 2006-15 వరకూ అంతా సాఫీగా సాగిందని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత అత్త విజయలక్ష్మీ తనను తన బిడ్డతో సహా ఇంట్లోంచి బయటకు పంపించారని ఆరోపించారు. ఆ తర్వాత ఇంట్లోకి రానివ్వలేదని.. భర్త నాగరాజు వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వేధించేవాడన్నారు. అప్పటి నుంచి దూరం పెట్టారని శ్రీలక్ష్మీ తన ఫిర్యాదులో పేర్కొంది.

విజయవాడ ఒకటో చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టులో గృహ హింస పిటీషన్ దాఖలు చేశారు. తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని.. నివాస వసతి కల్పించాలని.. వైద్య ఖర్చులను ఇప్పించాలని గృహ హింస చట్టం ప్రకారం న్యాయస్థానంలో కన్నా నాగరాజు, కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీలను ప్రతివాదులను చేర్చారు.

దీనిపై విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. పిటిషనర్ శ్రీలక్ష్మీ కీర్తికి, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని.. లేనిపక్షంలో ప్రత్యామ్మాయ వసతి కోసం నెలకు రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది.

రూ. కోటి పరిహారంతోపాటు నెలకు రూ.50 వేలు భరణంగా చెల్లించాలని.. కోర్టు ఖర్చుల కింద రూ.1000 ఇవ్వాలని తీర్పుచెప్పింది. అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మీ ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీలక్ష్మీతోపాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని స్పష్టం చేశారు. తీర్పు ఉత్తర్వులు విడుదలైన 3 నెలల్లోపు ఇవన్నీ అమలు చేయాలని కోర్టు ఆదేశించి కన్నా ఫ్యామిలీకి గట్టి షాక్ ఇచ్చింది.