రాముడి వారసులు...వాళ్లే కాదు మేం కూడా

Wed Aug 14 2019 07:00:02 GMT+0530 (IST)

Royal Families Claims To Be Lord Ram Descendant

శ్రీరాముడి వంశమైన రఘువంశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వెలుగులోకి వస్తున్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంలో భాగంగా ఈ చర్చ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. అనేకమంది తాము శ్రీరాముడికి వంశానికి చెందినవారమంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. శ్రీరాముడి కుమారుడైన కుశుడి వంశానికి చెందినవారమంటూ జైపుర్ రాజవంశీకురాలు - బీజేపీ ఎంపీ దియాకుమారి శనివారం వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సత్యేంద్ర సింగ్ తాము రఘువంశానికి చెందిన వారమంటూ ప్రకటించారు.మేవాడ్-ఉదయ్ పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ తాము రాముడి కుటుంబానికి చెందినవారమంటూ ప్రకటించారు. తాము రాముడి వంశస్థులమని - ఒకవేళ ఏవైనా వివరాలు కావాలనుకుంటే కోర్టు తమను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. రాముడి తొలి రాజధాని చిత్తోర్ అని తర్వాత దానిని ఉదయ్ పూర్ కు మార్చారని మహేంద్రసింగ్ తెలిపాడు. అక్కడ శిసోడియా వంశాన్ని ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారుడు. అవసరమైతే అందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తామని ప్రకటించడం గమనార్హం.

ఇదిలాఉండగా సుప్రీంకోర్టులో వాదనాల సందర్భంగా రాముడి వారసుల అంశం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్‌లల్లా విరాజ్ మాన్ తరఫున హాజరైన న్యాయవాది కే పరాశరణ్ ను ఉద్దేశించి రఘువంశానికి (శ్రీరాముడి వంశానికి) చెందిన వ్యక్తులు ఎవరైనా అయోధ్య లో ఇప్పటికీ నివసిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.   దీనిపై ప్రస్తుతం సమాచారం లేదని తెలుసుకుంటానని ఆయన బదులిచ్చారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసును వారంలోని ఐదు పనిదినాల్లోనూ విచారించడం వల్ల సన్నద్ధం కావడం తమకు సాధ్యం కాదన్న సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. రోజువారీ విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. వాదనలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైతే వారం మధ్యలో విరామం ఇస్తామని ముస్లిం కక్షిదారుల తరఫు న్యాయవాదికి హామీ ఇచ్చింది.