యార్లగడ్డకు ఎమ్మెల్సీ..వైసీపీలోకి వంశీకి లైన్ క్లియర్

Tue Nov 19 2019 19:15:14 GMT+0530 (IST)

Root Clear For Vallabhaneni vamshi To YSRCP

టీడీపీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో ఆ పార్టీ క్రమంగా అంతర్ధానమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలో మంచి పట్టున్న దేవినేని అవినాశ్ వైసీపీలోకి చేరిపోగా... ఇప్పటికే టీడీపీకి దూరం జరిగిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా వైసీపీలోకి చేరిపోయేందుకు రంగం సిద్ధం అయ్యింది. మొన్నటి ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధం ఓ రేంజిలో సాగింది. వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ నువ్వా - నేనా అన్నట్లుగా సాగారు. ఈ క్రమంలో జగన్ తో కలిసి నడిచేందుకు వంశీ సిద్ధమైతే... మరి యార్లగడ్డ పరిస్థితి ఏమిటన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమస్య కాస్తంత జఠిలమైనదేనని దీనిని పరిష్కరించడం అంత సులువు కాదన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ సమస్యకు జగన్ తనదైన శైలి ముగింపు పలికేశారు.ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత ఉప ఎన్నిక జరిగితే... వంశీనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమైందట. ఈ మేరకు యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మంగళవారం మంత్రులు కొడాలి నాని పేర్ని నానిలతో కలిసి వెంకట్రావు.. జగన్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వంశీని పార్టీలోకి తీసుకొచ్చే విషయం ప్రస్తావనకు రాగా... వంశీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జగన్... పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచిన వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లుగా చెప్పారట. దీంతో వంశీ ఎంట్రీకి సమ్మతించిన వెంకట్రావు సంతృప్తిగానే బయటకు వచ్చారట.

సింగిల్ సిట్టింగ్ లోనే వంశీ ఎంట్రీతో పాటు వెంకట్రావుకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించేసిన జగన్... గన్నవరంలో టీడీపీకి పోటీ చేసే నేతే లేకుండా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే దాసరి బాలవర్ధన రావు సహా దాసరి జైరమేశ్ లు కూడా వైసీపీలో చేరారు. గన్నవరంలో వంశీకి ముందు బాలవర్ధనరావు టీడీపీ నేతగా కొనసాగారు. వంశీ యాక్టివ్ అయిన తర్వాత టీడీపీ బాలవర్దనరావును పక్కనపెట్టేయగా... మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. తాజాగా వంశీ కూడా వైసీపీలోకి చేరిపోతే... టీడీపీకి అక్కడ పోటీ చేసే అభ్యర్థి దొరకడం కష్టమే. పొరుగు నేతలను తెచ్చిపెట్టడం మినహా టీడీపీకి గత్యంతరం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.