Begin typing your search above and press return to search.

రోనాల్డ్ Vs కోక్ బాటిల్ః అస‌లు క‌థ ఇదీ!

By:  Tupaki Desk   |   18 Jun 2021 11:30 PM GMT
రోనాల్డ్ Vs కోక్ బాటిల్ః  అస‌లు క‌థ ఇదీ!
X
ఇటీవ‌ల ప్ర‌పంచవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశం రొనాల్డో కోకాకోలా కూల్ డ్రింక్ బాటిల్స్ ప‌క్క‌కు జ‌ర‌ప‌డం! 2020లో జ‌రిగిన యూరో క‌ప్ లో భాగంగా.. హంగేరీ జ‌ట్టుతో మ్యాచ్ కు ముందు పోర్చుగ‌ల్ స్టార్ ప్లేయ‌ర్ రొనాల్డో ప్రెస్ మీట్ కు హాజ‌ర‌య్యాడు. అయితే.. రొనాల్డో వ‌చ్చే స‌మ‌యానికి అక్క‌డ టేబుల్ పై రెండు కోకాకోలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని ప‌క్క‌కు జ‌రిపిన రొనాల్డో.. వాట‌ర్ బాటిల్ ను ఎత్తి చూపించాడు. దీంతో.. కూల్ డ్రింక్ క‌న్నా వాట‌ర్ బాటిల్ ముద్దు అని చెబుతున్నాడ‌ని అర్థం చేసుకుంది ప్ర‌పంచం.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక‌, సాక‌ర్ వీరుల‌కు ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారో కూడా అంచ‌నా వేయ‌లేం. అంత‌లా ఉంటుంది వారి పాపులారిటీ. రొనాల్డో కోకాకోలా బాటిల్స్ ను ప‌క్క‌కు జ‌ర‌ప‌డంతో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం మానేయాల‌ని సూచించాడ‌ని భావించిన‌ట్టున్నారు ఫ్యాన్స్‌. అంతే.. ఆ మ‌రుస‌టి రోజు ఏకంగా 4 బిలియ‌న్ డాల‌ర్ల మార్కెట్ ను కోల్పోయింది కోకాకోలా కంపెనీ.

దీంతో.. వ‌ర‌ల్డ్ వైడ్ గా విస్తృత స్థాయి చ‌ర్చ జ‌రిగింది. సెల‌బ్రిటీల‌కు ఉన్న ప‌వ‌ర్ గురించి.. ఎవ‌రి వ్యాఖ్యానాలు వారు చేశారు. అయితే.. దీని వెనుక అస‌లు క‌థ వేరే ఉంద‌ని స‌మాచారం. బ్రాండ్ అంబాసిడ‌ర్ ఇష్యూ కార‌ణంగానే అలా చేయాల్సి వ‌చ్చిందంటూ మ‌రో వాద‌న వినిపిస్తోంది.

2006లో కోకాకోలాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు రోనాల్డో. 2010 - 12 స‌మ‌యంలో పెప్సీ బ్రాండ్ ను ప్ర‌చారం చేశాడు. 2013 త‌ర్వాత ఇలాంటి ఫిజీ డ్రింక్స్ ను ప్ర‌చారం చేయ‌డం మానేశాడు. 2013లో అమెరికాకు చెందిన హెర్బాలైఫ్ 24 అనే సంస్థ‌తో ఎనిమిదేళ్ల పాటు అంబాసిడ‌ర్ గా ఉండేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ సంస్థ కొత్త‌గా మార్కెట్లోకి స్పోర్ట్స్ డ్రింక్ ను కూడా తెచ్చింది. ‘హెర్బా లైఫ్ సీఆర్7 డ్రైవ్’ పేరుతో ఆ డ్రింక్ ను రిలీజ్ చేసింది.

అయితే.. ఈ ఒప్పందం ఉన్నంత కాలం.. మ‌రే ఇత‌ర డ్రింక్స్ కు ప్ర‌చారం చేయ‌డం కాదు.. క‌నీసం ఇత‌ర డ్రింక్స్ తాగ‌డం కూడా నిషేధ‌మే. ఈ కార‌ణంగానే.. కోకా కోలా బాటిల్స్ ను తీసి ప‌క్క‌న పెట్టాడ‌ని అంటున్నారు. మొత్తానికి ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తున్నారు. అస‌లు వాస్త‌వం ఏంట‌న్న‌ది రొనాల్డోకు మాత్ర‌మే తెలియాలి.