భయ్యా తోడా ప్యాజ్.. నో నో రోబో.. కొంచెం పానీపూరీ!

Sun Nov 28 2021 09:00:01 GMT+0530 (IST)

Robot serves panipuri

పానీపూరీ... పరిచయం అక్కర్లేని స్నాక్ ఐటెం. నార్త్ ఇండియా నుంచి మొదలైన ఈ పదార్థం దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ గోల్ గప్పాకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నపాటి కరకరలాడే పూరీలను.. మధ్యలో రంధ్రం పెట్టి అందులో కాసింత మసాలా వేసి... పుదీనా పానీలో ముంచుకొని తింటే అబ్బో స్వర్గం కనిపిస్తుంది. ఇక వర్షాకాలం శీతాకాలంలో అయితే దీని డిమాండ్ ను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజీలకు వెళ్లే విద్యార్థులయితే లొట్టలేసుకుంటూ మరీ రోజూ తింటారు. పూరీలు ఇచ్చే వ్యక్తిని భయ్యా అంటూ... తోడా ప్యాజ్ దాలో భయ్యా అంటూ లాగించేస్తారు. అయితే ఓ దుకాణంలో మాత్రం భయ్యా అంటే పానీపూరీలు రావు. ఎందుకంటే అక్కడ ఉన్నది రోబో కాబట్టి.అవును మీరు విన్నది నిజమే. రోబో పానీపూరీలు సర్వ్ చేస్తుంది. ఆ రోబో దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ కు పేమెంట్ చేస్తే చాలు... వేడీ వేడీ టేస్టీ టేస్టీ పానీ పూరీ.. అందులోకి కావాల్సిన పదార్థాలను కస్టమర్ల ముందు ఉంచుతుంది. ఈ రోబో గోల్ గప్పా బండి ఎక్కడ అంటే దిల్లీలోని ఓ కాలనీలో అన్నమాట. ఫుడ్ బ్లాగర్ విశాల్ షేర్ చేసిన వివరాల ప్రకారం దిల్లీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి దీనిని రూపొందించారు. కరోనా వేల కాంటాక్ట్ లెస్ గోల్ గప్పా వెండింగ్ మెషీన్ తయారుచేయాలనే సంకల్పంతో దీనిని డిజైన్ చేసినట్లు చెప్పారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికత ఉపయోగించి ఈ రోబోను తయారు చేసినట్లు పేర్కొన్నారు.    

రొబోటిక్ ఇంజినీర్ గా పనిచేసే గోవింద్... ఓ వైపు తన విధులు నిర్వరిస్తూనే విరామ సమయంలో ఈ వెండింగ్ మెషీన్ ను డిజైన్ చేశారు. పూర్తిస్తాయి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్లౌడ్ సాంకేతికతతో దీనిని రూపొందించినట్లు వెల్లడించారు. ఈ విధంగా చేసిన రోబో చక్కగా పనిచేస్తోందని అన్నారు. పానీ పూరీ తినాలనుకునే వారు ఆ రోబో దగ్గరు వెళ్లి... అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ కు డబ్బులు చెల్లిస్తే చాలు మనకు రావాల్సిన గోల్ గప్పాలను మన ముందు ఉంటుందట. అంతేకాకుండా పుదీనా ఉల్లిపాయలు నీరు వంటి అడిషినల్ థింగ్స్ కూడా అందుబాటులోనే ఉంచుతుందట. ప్రస్తుతం ఈ గోల్ గప్పా వెండింగ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా మారింది. దిల్లీ పానీపూరీ లవర్స్ అక్కడకు వెళ్లి హాయిగా... పానీపూరీని... ఆ రోబో సర్వీసులను ఎంజాయ్ చేస్తున్నారు.

ఫుడ్ బ్లాగర్ షేర్ చేసిన ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల నుంచి మంచి స్పందన వస్తోంది. భయ్యా... తోడా ప్యాజ్ దాలో అనే బదులు రోబో తోడా ప్యాజ్ అనాలా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందమైన అమ్మాయి వంటి రోబో గోల్ గప్పాలను రుచి చూడాలని ఉందంటూ మరికొందరు అంటున్నారు. ఇక దిల్లీ పానీపూరీ లవర్స్ అయితే ఆ రోబో పక్కన సెల్పీలకు క్యూ కడుతున్నారు. గోల్ గప్పాలను సర్వ్ చేసే రోబో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.