Begin typing your search above and press return to search.

ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:41 PM GMT
ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్..!
X
పాకిస్తాన్ లో గత కొన్నినెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతోపాటు డాలర్ తో పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో దిగుమతులపై ఆ భారం పడింది. దీంతో పాకిస్థాన్ శ్రీలంక తరహాలో దివాళా తీయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.

మరోవైపు పాకిస్తాన్లో వంట గ్యాస్.. గోధుమ పిండి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పనిలో పనిగా ప్రస్తుత సర్కార్ మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే పాక్ సీనియర్ క్రికెట్ వహాబ్ రియాజ్ కు క్రీడా మంత్రిగా అవకాశం దక్కింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రియాజ్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్ జరుగుతున్న ప్రీమియర్ లీగ్ లో రియాజ్ బిజీగా గడుపుతున్నాడు. రియాజ్ కు మంత్రి పదవి దక్కడంతో ఉన్నఫలంగా పాక్ కు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ నుంచి రియాజ్ పాకిస్థాన్ కు వెళ్లిన తర్వాత క్రీడల మంత్రిగా ప్రమాణం చేయనున్నాడు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు రాజకీయ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇకపోతే రియాజ్ 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 91 వన్డేల్లో 120 వికెట్లు.. 27 టెస్టుల్లో 83 వికెట్లు.. 36 టీ20ల్లో 38 వికెట్లను పడగొట్టాడు.

అలాగే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్ జట్టులో రియాజ్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే 2020 తర్వాత మాత్రం పాక్ జట్టులో చోటు సంపాదించుకోలేక పోయాడు. నాటి నుంచి టీ20 లీగ్స్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్న రియాజ్ మొత్తంగా 400 వికెట్లకు పైగా తీశాడు. ప్రస్తుతం బీపీఎల్ లో ఖుల్నా టైగర్ తరఫున ఆడుతున్న రియాజ్ తొమ్మిది వికెట్లు తీశాడు. ఏది ఏమైనా పాక్ ఆర్థిక సంక్షోభం వేళ రియాజ్ కు మంత్రి పదవి దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.