Begin typing your search above and press return to search.

కేసీయార్లో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   15 Aug 2022 5:17 AM GMT
కేసీయార్లో పెరిగిపోతున్న టెన్షన్
X
రోజులు గడిచే కొద్దీ మునుగోడు ఉప ఎన్నికల టెన్షన్ కేసీయార్లో స్పష్టంగా కనబడుతోంది. ఈనెల 20వ తేదీన మునుగోడులో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి జనసమీకరణ ఎలాగన్నది పెద్ద సమస్యగా మారిపోయింది.

ఒకవైపేమో అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీయార్ కు ద్వితీయశ్రేణి నేతల సహాయనిరాకరణ. మరో వైపేమో ద్వితీయశ్రేణి నేతల సాయం లేకుండా ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమని తేల్చిన రిపోర్టులు. మరోవైపు మామూలుగా తన ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే రిపోర్టులు.

ఇన్ని సమస్యల మధ్య ఉప ఎన్నికల ప్రచారంలో స్వయంగా కేసీయారే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో ఎక్కడో ఒకచోట బహిరంగ సభలో మాట్లాడేసి మిగిలిన ప్రచారమంతా మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలపైన వదిలేసేవారు. కానీ మునుగోడులో అలావదిలేస్తే పనిజరగదని అర్ధమైపోయిందట. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పార్టీకి తగిలిన ఎదురుదెబ్బలే దీనికి నిదర్శనం.

అందుకనే మునుగోడు ఉపఎన్నికలో తాను కూడా ప్రచారంలో పాల్గొనాల్సిందే అని కేసీయార్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలతో కేసీయార్ రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. 20వ తేదీ బహిరంగ సభలో జన సమీకరణ, జనాల స్పందనను బట్టి మరిన్ని బహిరంగ సభలను ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఉపఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలని కేసీయార్ కు చాలా బలంగా ఉంది. కానీ కూసుకుంట్లను అంతేస్థాయిలో ద్వితీయశ్రేణి నేతలు బలంగా వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా కేసీయార్ చెప్పినా నేతలెవరు వినలేదు.

దాంతో నేతల వ్యతిరేకత కారణంగా అభ్యర్ధిని మార్చాలా ? లేకపోతే నేతలందరికీ చెప్పాల్సిన రీతిలో నచ్చచెప్పి దారితెచ్చుకోవాలా ? అనేదే కేసీయార్ కు అర్ధం కావటం లేదు. ఈ విషయంలో ఏ చిన్న పొరబాటు జరిగినా పార్టీ నష్టపోవటం ఖాయం. నియోజకవర్గంలో ఇంతమంది వ్యతిరేకిస్తున్న ప్రభాకరరెడ్డిని అభ్యర్ధిగా దించటమంటే ఎంతమంది నేతలు మనస్పూర్తిగా పనిచేస్తున్నారో నిఘావుంచటంతోనే పుణ్యకాలమంతా సరిపోతుంది. ఒకవేళ అందరు కలిసి పుట్టి ముంచినా ముంచుతారు. ఇందుకనే కేసీయార్లో టెన్షన్ బాగా పెరిగిపోతోందట.