Begin typing your search above and press return to search.

డీఎస్ తో రేవంత్ రాజకీయం.. ఆసక్తి రేపుతోన్న కలయిక

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 PM GMT
డీఎస్ తో రేవంత్ రాజకీయం.. ఆసక్తి రేపుతోన్న కలయిక
X
ఉమ్మడి ఏపీలో రెండు సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్-డీఎస్ ద్వయంది ఎవర్ గ్రీన్ జోడి. వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ నే.. సమకాలీన రాజకీయాల్లో ఆరితేరిన నేతగా డీ శ్రీనివాస్ కు పేరుంది. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ తోనూ దూరం జరిగి ఇప్పుడు ఏ పార్టీలో చేరకుండా గమ్మున ఉంటున్నారు.

అయితే కాంగ్రెస్ పాత కాపులనంతా కలుస్తూ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి ఆశ్చర్యపరిచాడు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్లను కలుస్తూ కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా నియమితులైన వెంటనే సీనియర్ నేతలను కలుసి ఆశీస్సులు తీసుకున్న రేవంత్ రెడ్డి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.

తాజాగా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్.. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ కీలక భూమిక పోషించిన రాజకీయ కురువృద్ధుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి అయిన ధర్మపురి శ్రీనివాస్ ను కలిశాడు. ఇటీవల ఆయన జన్మదినం సందర్భంగా డీఎస్ పూజగదిలో కాలుజారి పడడంతో చేయి విరిగింది. ఆస్పత్రిలో సర్జరీ కూడా చేశారు.

ఆపరేషన్ అనంతరం ఇంటికొచ్చిన డీఎస్ ను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. డీఎస్ తో రేవంత్ రెడ్డి కీలక భేటి నిర్వహించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి చక్రంతిప్పి ఏకంగా బీజేపీ ఎంపీ తండ్రిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించడం విశేషం. ఇటీవలే ఎంపీ అరవింద్, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు రేవంత్ వ్యూహం పనిచేస్తే డీఎస్ కాంగ్రెస్ లోకి తిరిగి వస్తే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.