Begin typing your search above and press return to search.

రేవంతుడి యురేనియం పోరు... కాంగ్రెస్ కు జీవం పోసేనా?

By:  Tupaki Desk   |   19 Aug 2019 5:42 PM GMT
రేవంతుడి యురేనియం పోరు... కాంగ్రెస్ కు జీవం పోసేనా?
X
తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. తెలుగు నేల విభజనతో ఏపీలో ఆ పార్టీ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా... తెలంగాణలో అంతకంతకూ క్షీణిస్తోంది. అయితే గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి బిగ్ బూస్టిచ్చే క్రమంలోనే సాగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ మోస్తరులో సత్తా చాటింది. ఈ సత్తా చాటడంలో మల్కాజిగిరీ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి... తాను గెలవడంతో పాటుగా పార్టీ శ్రేణులను కదిలించారనే చెప్పాలి. పార్టీ స్టామినా క్రమేణా కనుమరుగు అవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ కొత్త పోరాటానికి తెర తీసి... తనతో పాటు పార్టీకి కూడా జీవం పోసే దిశగా కదులుతున్నారనే చెప్పాలి. ఆ పోరేమిటి? దాని ద్వారా రేవంత్ కు, కాంగ్రెస్ పార్టీకి లాభించే అంశాలేమిటన్న విషయాలపై ఇప్పుడు తెలుగు నాట ఆసక్తికర చర్చకే తెర లేసింది. ఆ కథేమిటో మనమూ చూద్దాం పదండి.

తెలంగాణలోని నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాల పరిధిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఉన్న సంగతి తెలిసిందే కదా. టైగర్ రిజర్వ్ గా పరిగణిస్తున్న ఈ అడవుల్లో పెద్ద సంఖ్యలో పులులు కూడా ఉన్నాయి. ఈ పులులతో పాటు ఈ అడవుల్లో విలువైన యురేనియం నిక్షేపాలు ఉన్నాయన్న విషయం చాలా కాలం క్రితమే బయటపడింది. చాలా కాలంగా ఈ నిక్షేపాల కోసం తవ్వకాలు జరపాలన్న పలు సంస్థల యత్నాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండగా... తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కేంద్రం అనుమతి నేపథ్యంలో తెలంగాణలోని కేసీఆర్ సర్కారు కూడా తవ్వకాలకు నో అబ్జెక్షన్ చెప్పేసింది. ఇక తవ్వకాలే తరువాయి అన్న చందంగా పరిస్థితి మారింది. అయితే ఈ ప్రాంతంలో అరుదైన పులులతో పాటు గిరిజన జాతి చెంచులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

యురేనియం తవ్వకాలు జరిగితే... పులులు అంతరించడంతో పాటుగా చెంచులు కూడా చెల్లాచెదురు కాక తప్పదు. అంతేకాకుండా పర్యావరణం కూడా దెబ్బ తింటుంది. పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుంది. మొత్తంగా ఎలా చూసినా... యురేనియం తవ్వకాలు ప్రజావ్యతిరేక నిర్ణయమే. ఇప్పుడు ఇదే విషయంపై అదే ప్రాంతానికి కూతవేటు దూరంలోని, ఒకప్పుడు నాగర్ కర్నూల్ ప్రాంతం ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి అందరి కంటే చాలా ముందే మేల్కొన్నారు. ఎలాగూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరు సాగించే విషయంలో రేవంత్ రెడ్డికి మంచి పేరే ఉంది. పార్టీ ప్రాభవం కొడిగడుతున్న ప్రస్తుత తరుణంలో యురేనియంపై తనదైన శైలి పోరు మొదలెడితే ఎలా ఉంటుంది అన్న దిశగా ఆలోచించిన రేవంత్... ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పోరును ఇప్పటికే ప్రారంభించేశారు.

యురేనియం తవ్వకాలపై ఇటు టీఆర్ఎస్ గానీ, అటు బీజేపీ గానీ పోరాటం చేసే అవకాశమే లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రంగంలోకి దిగితే... కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంఘాలు, ప్రజలు, గిరిజన సంఘాల మద్దతు గ్యారెంటీ. ఈ లెక్కలనే బేరీజు వేసుకున్న రేవంత్ ఇప్పటికే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టేశారు. త్వరలోనే ఈ ఉద్యమాన్ని ఆయన మరింతగా ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోరును తనదైన శైలిలో సాగిస్తే... తనతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ బూస్టేనన్నది రేవంత్ అంచనా. మరి ఈ దిశగా రేవంత్ సాగిస్తున్న యురేనియంపై పోరు.. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఏ మేర ఉపకరిస్తుందో చూడాలి.