Begin typing your search above and press return to search.

రేవంత్ డేరింగ్... వేరీజ్ కేటీఆర్? అనేశారే

By:  Tupaki Desk   |   27 Sep 2020 3:00 PM GMT
రేవంత్ డేరింగ్... వేరీజ్ కేటీఆర్? అనేశారే
X
తెలంగాణలో భావి ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్న మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఏదైనా విమర్శ చేయాలంటే... కాస్తంత ముందూ వెనుకా ఆలోచించాల్సిందే. ఎందుకంటే... అసలు అధికారంలోని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ - త్వరలో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్న కేటీఆర్ పై ఈగ వాలిందంటే చాలు.. గులాబీ శ్రేణులు విరుచుకుపడిపోతాయి. అయితే టీఆర్ ఎస్ గానీ - ఇంకే పార్టీ అయినా గానీ... తనదైన శైలిలో విమర్శల దాడికి దిగే సత్తా కలిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ - మల్కాజిగిరీ ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రం మరోమారు కేటీఆర్ పై ఓ రేంజిలో ఫైరైపోయారు. మంత్రివర్యా కేటీఆర్... ఎక్కడున్నావయ్యా అంటూ రేవంత్ విసిరిన విమర్శలు - ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి.

అయినా ఇప్పుడు కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఎందుకు ఫైరయ్యారన్న విషయానికి వస్తే... గడచిన కొన్ని రోజులుగా బారీ వర్షాలు కురుస్తున్నాయి కదా... వర్షాలకు మన భాగ్యనగరి హైదరాబాద్ వీధులు - కాలనీలు ఏ రీతిన నీట మునిగి దర్శనమిస్తాయో చెప్పనక్కర్లేదు కదా. ఈ సారి కూడా బారీ వర్షాలకు నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలో నీట మునిగిన పలు కాలనీలను సందర్శించిన రేవంత్ రెడ్డి... ఆయా కాలనీల ప్రజలకు అండగా నిలిచే యత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ను ఎంతగానో అభివృద్ధి చేశామంటూ కేసీఆర్ సర్కారు చేస్తున్న ప్రచారం గుర్తుకు వచ్చిన రేవంత్ ఒక్కసారిగా.. మునిసిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.

ఇంతకు కేటీఆర్ పై రేవంత్ ఎలాంటి ప్రశ్నలు సంధించారన్న విషయానికి వస్తే... నిత్యం ట్వీట్టర్ - వీడియో కాన్ఫరెన్స్ ల్లో కనిపించే కేటీఆర్... వర్షాలతో అల్లాడిపోతున్న ప్రజలు కష్టాలు పడుతుంటే ఎక్కడా కనిపించరే? అంటూ రేవంత్ తనదైన సెటైరిక్ మోడ్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రులకు పట్టడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి మునిసిపల్ మంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్ నగరంలోని ఈ తరహా సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారని రేవంత్ నిలదీశారు. అట్టహాసంగా జరుగుతున్న ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాలకు హాజరవుతున్న కేటీఆర్... వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అసలు ఈ పరిస్థితులు చూస్తుంటే.. హైదరాబాద్ విశ్వనగరమా? లేదంటే మురికి కూపమా? అన్న అనుమానం కలుగుతోందని కూడా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరం ఇప్పుడిలా కనిపిస్తున్నందుకు కారణం కూడా టీఆర్ఎస్సేనని, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దురాక్రమణల వల్లే వరద నీటికి కాలనీలు మునిగిపోతున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఒకే అంశంపై అటు కేటీఆర్ ను, ఇటు స్థానిక ఎమ్మెల్యేను తనదైన శైలిలో రఫ్పాడించిన రేవంత్ రెడ్డి దాదాపుగా అన్నీ వాలిడ్ పాయింట్లనే ప్రస్తావించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.