Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు కృష్ణానీటిని వ‌ద్దంటున్న వారితో పోరాడ‌తాన‌ని చెప్ప‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   1 March 2021 2:30 AM GMT
తెలంగాణ‌కు కృష్ణానీటిని వ‌ద్దంటున్న వారితో పోరాడ‌తాన‌ని చెప్ప‌గ‌ల‌రా?
X
పుట్టినిల్లు ఏపీ.. మెట్టినిల్లు తెలంగాణ అంటూ.. తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేస్తున్న వైఎస్ ష‌ర్మిల‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ - ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి భారీ స‌వాల్ విసిరారు. ``క‌ర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజుపై నిల‌బ‌డి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌‌కు కృష్ణాజ‌లాలు ఇవ్వ‌డానికి వ్య‌తిరేకిస్తున్న ఏ శ‌క్తితో అయినా పోరాడ‌తాన‌ని ప్ర‌క‌టించ‌గ‌ల‌రా?!``- అని స‌వాల్ విసిరారు. కృష్ణాజ‌లాల పంప‌కాల్లో ఏపీ - తెలంగాణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఆ కార‌ణంగానే తెలంగాణ ఉద్య‌మం పురుడు పోసుకుంద‌ని రేవంత్ తెలిపారు. ముఖ్యంగా ద‌క్షిణ తెలంగాణ ప్రాంతంలో ఖ‌మ్మం - మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ - రంగారెడ్డి - న‌ల్ల‌గొండ జిల్లాల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డి యువ‌త ఉదపాధి వెతుక్కుంటూ వ‌ల‌స వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు.

వైఎస్ ష‌ర్మిల సోద‌రుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్.. కృష్ణాన‌ది ప‌రివాహ‌కం పై పోతిరెడ్డిపాడు, సంగంబండ రిజ‌ర్వాయ‌ర్ స‌హా అనేక సుంకేశుల‌తో సంబంధం ఉన్న ప‌లు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విష‌యాన్ని రేవంత్ పేర్కొన్నారు. అంతేకాదు.. తెలంగాణ ప్ర‌భుత్వం గోదావ‌రి న‌దిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌ను అడ్డు కునేందుకు సీఎం జ‌గ‌న్ కేసులు దాఖ‌లు చేశార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో పార్టీ పెడ‌తాన‌ని చెబుతున్న ష‌ర్మిల‌.. ఈ ప‌నులు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం చేసేవేన‌ని ప్ర‌క‌టించ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. అప్పుడు మాత్ర‌మే తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌తినిధిగా నిల‌బ‌డేందుకు ఆమెకు హ‌క్కు ఉంటుంద‌ని రేవంత్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి ఏపీ కోసం తాను చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో త‌న‌ను క్షమించాల‌ని.. తెలంగాణ అమ‌రవీరుల స్థూపం వ‌ద్ద నిల‌బ‌డి ష‌ర్మిల కొర‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ కోసం 1200 మంది యువ‌త ప్రాణాలు కోల్పోయార‌ని రేవంత్ తెలిపారు. దేశంలో ఎవ‌రైనా.. ఎక్క‌డైనా రాజ‌కీయ పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంద‌న్న రేవంత్‌.. రాయ‌ల‌సీమ నాయ‌కుల‌పై ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌న్నారు. అయితే.. వైఎస్‌పై అభిమానం ఉన్న ప్ర‌జ‌లు తెలంగాణ‌లో ఉన్నార‌ని చెప్పారు. తెలంగాణ అనేక స‌మ‌స్య‌ల కు ప‌రిష్కారంగా ఏర్ప‌డిన రాష్ట్ర‌మ‌ని.. ఇప్పుడు ష‌ర్మిల ఏర్పాటు చేయ‌బోయే పార్టీ మ‌ళ్లీ రాష్ట్రాన్ని నిజాం పాల‌న వైపు న‌డిపిస్తుంద‌ని.. రేవంత్ ఉద్ఘాటించారు. కాగా, అధికార టీఆర్ ఎస్ నాయ‌కులు ఏపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం కామ‌నేన‌ని, కానీ, ష‌ర్మిల విష‌యంలో మాత్రం వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్న‌ర‌ని రేవంత్ విమ‌ర్శించారు.