Begin typing your search above and press return to search.

రేవంత్ పాద‌యాత్ర‌.. ఆ జిల్లాపై ఫోక‌స్ రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   24 Jan 2023 2:15 PM GMT
రేవంత్ పాద‌యాత్ర‌.. ఆ జిల్లాపై ఫోక‌స్ రీజ‌న్ ఇదే!
X
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అయితే, ఆయ‌న త‌న పాద‌యాత్ర‌ను ఖ‌మ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు తెలుస్తోంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని రామాల‌యం నుంచి రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే.. ఇప్పుడు ఇక్క‌డ నుంచే ఇటీవ‌ల బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ స‌భ పెట్ట‌డం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇక్క‌డే పెద్ద ఎత్తున కొన్ని రోజుల కింద‌ట స‌భ నిర్వ‌హించ‌డం వంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

దీంతో రేవంత్ కూడా ఇక్క‌డ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌డం ఆస‌క్తిగా మారింది. రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉండ‌గా.. రేవంత్ ఇక్క‌డ నుంచే పాద‌యాత్ర ప్రారంభించ‌డంపై రాజ‌కీయంగా కూడా చ‌ర్చ‌సాగుతోంది.

దీనికి కార‌ణం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మ‌డి జిల్లాల్లో.. ఖ‌మ్మం కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంది. బ‌ల‌మైన నాయ‌కులు రేణుకా చౌద‌రి, భ‌ట్టి విక్ర‌మార్క‌.. వంటివారు ఉన్నారు. ఈ క్ర‌మంలో దీనికి తోడు.. గ‌త 2018 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుంది.

వీరిలో న‌లుగురు పార్టీకి దూర‌మైనా.. పార్టీకి ఆయువుప‌ట్టు వంటి ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా ఉంది. దీంతో.. ప‌వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ప‌ట్టును మ‌రింత పెంచుకునేందుకు జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు భద్రాద్రి నుంచే రేవంత్ పాద‌యాత్ర ప్రారంభిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాష్ట్రానికి ఈశాన్య ప్రాంతంగా ఉన్న ఖ‌మ్మం నుంచి ప‌నులు ప్రారంభించ‌డం ద్వారా వాస్తు ప‌రంగా కూడా క‌లిసి వ‌స్తుంద‌నే సెంటిమెంటును కూడా చెబుతున్నారు.

ఇప్ప‌టికే పీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి భద్రాచలం నుంచి పాదయాత్ర చేయాలని రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. ఈ యాత్ర‌లో రాష్ట్రనేతలంతా తమ ప్రాంతాల్లో 30నుంచి 35 నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణ‌యించారు. దీంతో కాంగ్రెస్‌ సీనియర్లంతా ఆయా జిల్లాల్లో జరిగే పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. ఫిబ్రవరి 6న భద్రాచలంనుంచి మోగించబోతున్న ఎన్నికల భేరీ, ప్రచార శంఖారావం వంటివి రేవంత్‌కు కీల‌కం కానుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.