Begin typing your search above and press return to search.

ప్రపంచం చాలా చిన్నది.. అన్న శవాన్ని తమ్ముడే !

By:  Tupaki Desk   |   30 July 2021 7:47 AM GMT
ప్రపంచం చాలా చిన్నది.. అన్న శవాన్ని తమ్ముడే !
X
విధి ఆడే వింత నాటకం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఓ శవాన్ని విధి నిర్వహణ లో భాగంగా అగ్నిమాప‌క‌శాఖ అధికారి బయటకి తీసాడు. ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే .. విధుల్లో భాగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాన‌ని అనుకున్నాడే త‌ప్ప‌, త‌న అన్న శ‌వాన్ని వెలికి తీస్తున్న చేదు నిజం అత‌నికి తెలియ‌లేదు. చివ‌రికి మృతుడు త‌న అన్న తెలుసుకుని జీవితమే పోయినట్టుగా గుండెలు పగిలేలా ఏడ్చాడు.

హన్మకొండ జిల్లా సూర్యానాయక్‌ తండాకు చెందిన రిటైర్డ్ ఎస్ ఐ పాపయ్యనాయక్‌ రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. కరీంనగర్‌ లో స్థిరపడ్డారు. రాజీవ్‌ రహదారిపై గురువారం ముల్కనూర్‌ వైపు వెళ్తుండగా ఆయన కారు అదుపుతప్పి రోడ్డు ప‌క్క‌నున్న బావిలో పడింది. కారుతో పాటే ఆయన జలసమాధి అయ్యారు. కారును బావిలో నుంచి బ‌య‌టికి తీసేందుకు స‌మీపంలోని మాన‌కొండూర్‌ అగ్నిమాపక శాఖ సహాయాన్ని పోలీసులు కోరారు. ఆ అగ్నిమాప‌క‌శాఖ అధికారిగా భూద‌య్య‌నాయ‌క్ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. పోలీసుల స‌మాచారంతో ఆయ‌న సిబ్బందితో క‌లిసి సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

60 అడుగుల లోతులో ఉన్న కారును బ‌య‌టికి తీసేందుకు క్రేన్ ర‌ప్పించారు. పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 9 గంట‌ల పాటు శ్రమించి ఎట్టకేలకు కారును రాత్రి 8 గంటల తరువాత వెలికి తీశారు. మృతదేహాన్ని చూడ‌గానే అగ్నిమాపకశాఖ అధికారి భూదయ్యలో ఆందోళ‌న‌, దుఃఖం క‌ట్ట‌లు తెంచుకున్నాయి. మృత‌దేహం త‌న సొంత అన్న రిటైర్ ఎస్ ఐ పాపయ్యనాయక్‌ ది గా గుర్తించి బోరుమ‌ని విల‌పించాడు. బావిలో ప‌డిన కారులో అన్న ఉన్నాడ‌నే విష‌యం తెలియ‌క‌.... అధికారిగా తమ్ముడు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం విధి ఆడిన వింత నాట‌కం అని చెప్పవచ్చు. పాపయ్య నాయక్ హుస్నాబాద్ అక్కన్నపేటలో గతంలో ఎస్ఐగా విధులు నిర్వహించి, ఇటీవలే పదవీ విరమణ పొందారు. కరీంనగర్ నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ఐదు మంది వరకు ఉన్నట్లు మొదట భావించినా.. కారు బయటకు తీసిన తర్వాత ఒక మృతదేహాన్ని గుర్తించారు.