Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలివే

By:  Tupaki Desk   |   2 May 2021 3:12 PM GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలివే
X
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రి 8 గంటలు దాటినా ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. అధికారికంగా ఈసీ ముగిసిందని ప్రకటించలేదు. సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాల్లో ఆధిక్యాలు ఇలా ఉన్నాయి.

-బెంగాల్ లో మమత విజయం సంపూర్ణం
-పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ 165 స్థానాల్లో విజయం సాధించిందని ఈసీ తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిందని తెలిపింది. ఇంకా 52 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. 2016లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 47 స్థానాల్లో బెంగాల్ లో గెలిచింది. ఇక 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అప్రతిహతంగా బెంగాల్ ను ఏలిన వామపక్షాలకు ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే దక్కి ఘోర పరాజయం చవిచూసింది.

ఇక ఆద్యంతం రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ పోరులో తన సమీప బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1622 ఓట్ల తేడాతో సీఎం మమతాబెనర్జీపై సంచలన విజయం సాధించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈసీ బీజేపీ ప్రతినిధిలా పనిచేస్తోందని మండిపడ్డారు. నందిగ్రామ్ లో ఓడినా.. రాష్ట్రంలో 221 కు పైగా సీట్లు సాధించామని చెప్పారు. అయితే ఇంకా కౌంటింగ్ అయిపోలేదని.. కొనసాగుతుందని టీఎంసీ తెలిపింది.

-తమిళనాడులో డీఎంకేదే అధికారం
ఇక తమిళనాడులో డీఎంకే స్ఫష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఇప్పటికే 50 స్థానాల్లో విజయం సాధించగా.. ఇంకా 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక అధికార అన్నాడీఎంకే 17 స్థానాల్లో గెలుపొంది 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తమిళనాడు సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం గెలుపొందారు. ఇక కోయంబత్తూర్ సౌత్ లో పోటీచేసిన కమల్ హాసన్ వెనుకంజలో నిలిచినట్టు వార్తలు వచ్చాయి.

-కేరళ మళ్లీ కమ్యూనిస్టులదే..
కేరళ మరోసారి కమ్యూనిస్టుల పరం అయ్యింది. కేరళలో ఎల్డీఎఫ్ 88 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ ను దాటేసింది. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. యూడీఎఫ్ 37 స్థానాలు గెలుచుకోగా.. మరో నాలుగు స్తానాల్లో ఆధిక్యంలో ఉంది.

-పుదుచ్చేరిలో ఎన్టీఏదే ఆధిక్యం
ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 8 చోట్ల గెలుపొంది మరో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఐఎన్ఎస్ 3 చోట్ల గెలుపొంది మరో మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. ఇక్కడ ఇండిపెండెంట్ల మద్తతుతోనే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వారే కింగ్ మేకర్లుగా ఉన్నారు. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 15 మంది కావాలి.

-అస్సాం బీజేపీదే..
అస్సాంలో మరోసారి బీజేపీ అధికారం సాధించింది. ఇక్కడ మొత్తం 126 స్థానాల్లో బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించగా.. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల గెలుపొందింది. ఆరు చోట్ల లీడ్ లో ఉంది. మేజిక్ మార్క్ 64 కాగా బీజేపీ అంతకుమించి సీట్లు సాధించడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

-తెలుగు రాష్ట్రాల్లో..
తిరుపతిలో అధికార వైసీపీనే ప్రజలు గెలిపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. దాదాపు 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మీ 3,53,190 ఓట్లను తెచ్చుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 56820 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 9549 ఓట్లు పడ్డాయి.

ఇక తెలంగాణలోని నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18449 ఓట్ల మెజార్టీతో గెలిచారు.నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు 74726 ఓట్లు, కాంగ్రెస్ కు 59239 ఓట్లు, బీజేపీకి 6365 ఓట్లు పోలయ్యాయి. సాగర్ లో మొత్తంగా జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీకి సాగర్ లో డిపాజిట్ కోల్పోవడం తీరని అవమానంగా మారింది.