Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ 17.. హీటెక్కిన తెలంగాణ

By:  Tupaki Desk   |   14 Sep 2021 9:51 AM GMT
సెప్టెంబర్ 17.. హీటెక్కిన తెలంగాణ
X
తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పొలిటికల్ హీట్ ను పెంచారు. అయితే ఉపఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో కాస్త కామ్ అయ్యారు. అయితే ఈనెల 17వ తేదీని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకోబోతున్నాయి. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారతదేశంలో విలీనమైంది. అయితే ఈ తేదీని కొందరు విమోచనం అని.. విలీనం అని.. విద్రోహ దినం అని భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రతీసారి సెప్టెంబర్ 17 రాగానే ఆయా పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈసారి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు ఇదే రోజున బహిరంగ సభలు పెట్టాయి.

తెలంగాణలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న బీజేపీ త్వరలో జరిగే ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో వ్యక్తిగతంగా, పార్టీ బలంతో గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. హుజూరాబాద్ లో విజయం సాధించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు సెంట్రల్ పెద్దలు కూడా ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు హూజూరాబాద్లో పర్యటించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక అయ్యే లోపు వచ్చిన ప్రతీ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీన నిర్మల్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమిత్ షా రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ లో బహిరంగ సభను నిర్వహించబోతుంది. అంతకుముందు కాంగ్రెస్ సెప్టెంబర్ 17న విలీన దినంగా జరిపేది. అయితే సెప్టెంబర్ 17వ తేదీ గురించి ప్రత్యేకంగా సభను పెట్టకున్నా.. గిరిజన ఆత్మ గౌరవ సభ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరోవైపు కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో కాంగ్రెస్ సభ పెట్టనుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సభ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. టీపీసీసీ కొత్త కమిటీ నియామకం అయిన తరువాత కాంగ్రెస్ ఇప్పటికే పలు జిల్లాల్లో గిరిజన ఆత్మ గౌరవ సభలను నిర్వహించింది.

ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం ప్రతీసారి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు జరుపుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి ప్రోగ్రాంలు, వ్యాఖ్యలు మాత్రం చేయడం లేదు. దీంతో బీజేపీ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉన్నా తమ వైఖరి మారబోదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ఒకే రోజు బహిరంగ సభలను నిర్వహించడం రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ తరువాత తామే ప్రత్యామ్నాయం అంటూ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చెబుతోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుత టీపీసీసీ మాత్రం కనీసం సెకండ్ ప్లేస్ ను భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే 17న బీజేపీకి పోటా పోటీగా బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ రెండు పార్టీలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేవి. మరి ఆరోజు ఏ పార్టీ ఎలాంటి ప్రసంగాలు చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.