15ఏళ్ల క్రితం రిజైన్ చేశాడు.. ఇప్పటికీ జీతం పడుతూనే ఉంది..!

Thu Apr 22 2021 20:24:55 GMT+0530 (IST)

Resigned 15 years ago still getting paid

ఒక రోజు డ్యూటీకి సెలవు పెట్టి.. లీవ్ ఫామ్ సబ్ మిట్ చేయకపోతే.. ఆ నెలలో జీతం కోత పడుతుంది. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త వింటే మాత్రం నోరెళ్లబెడతారు. ఒకటీ రెండు కాదు.. అప్పుడెప్పుడో 15 సంవత్సరాల కింద ఉద్యోగం వదిలేశాడు. కానీ.. అతడికి ప్రతినెలా టంచన్ గా వేతనం క్రెడిట్ అవుతూనే ఉంది. ఒక్క రోజు కోతకూడా లేకుండా.. మొత్తం సాలరీ బ్యాంకులో పడిపోతోంది. ఆలస్యంగా గుర్తించిన యాజమాన్యం.. అదెలా సాధ్యమైందా? అని తల పట్టుకుంటోంది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. కేసు కోర్టు వద్దకు వెళ్లింది.ఇదంతా.. ఇటలీలో జరిగింది. కాటాన్జారోలోని కాలాబ్రియన్ నగరంలో ఉన్న పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో ఒక ఉద్యోగి పనిచేస్తూ ఉండేవాడు. ఆయన 2005లో ఉద్యోగం వదిలేశాడు. అయినప్పటికీ ప్రతినెలా అతడి అకౌంట్లో వేతనం పడుతూనే ఉంది. ఆ విధంగా ఈ పదిహేను సంవత్సరాల్లో అతనికి అందిన వేతనం మొత్తం 538000 పౌండ్లు. అంటే.. మన కరెన్సీలో 4.85 కోట్ల రూపాయలు!

మరి ఈ విషయం ఇప్పుడు ఎలా బయటపడిందంటే.. కరోనా వెలికితీసిందని చెప్పొచ్చు. కొవిడ్ నేపథ్యంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. కొందరు ఆఫీసుకు వస్తున్నారు. దీంతో.. ఇంటిదగ్గర్నుంచి డ్యూటీ చేసేవారు.. ఆఫీసుకు వచ్చే వారి లిస్టును సెపరేట్ చేస్తుండగా.. ఇతగాడి పేరు బయటకు వచ్చింది.

ఇతను ఎప్పుడో ఉద్యోగం మానేశాడు కదా.. ఇప్పుడెలా లిస్టులోకి వచ్చిందని తవ్వితే.. వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ వ్యవహారంలో కలిగిన నష్టం తెలుసుకొని అందరూ నోరెళ్లబెట్టారు. వెంటనే హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్లోని మేనేజర్ తో అందరినీ విచారించారు. పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి కోర్టుకు సబ్ మిట్ చేశారు.

అయితే.. ఆసుపత్రి డైరెక్టర్ ను సదరు నిందితుడు బెదిరించాడట. ఆ డైరెక్టర్ కు సంబంధించిన సీక్రెట్ ఏంటో తెలియదుగానీ.. ఉద్యోగం మానేసిన తర్వాత వేతనం పడేలా చూశాడట. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. ఆ నిందితుడి వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు! మరి కోర్టు అతడిని శిక్షిస్తుందా? వేస్తే ఎలాంటి శిక్ష వేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.