ఇది కూడా ఎన్నికల తాయిలమేనా.. ఏపీలో ఆ రెండు వర్గాలకు రిజర్వేషన్!

Sun Sep 25 2022 11:08:52 GMT+0530 (India Standard Time)

Reservation for those two categories in AP

ఆంధ్రప్రదేశ్‌లో బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లింలకు ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. దీంతో అప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 46 శాతంగా ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముస్లింల్లోని మరో రెండు ఉప వర్గాలకు కూడా రిజర్వేషన్లను ప్రకటించింది.  ముస్లింలలో మహ్మద్ అబ్దుల్ అనే ఇంటి పేర్లు ఉన్నవారికి బీసీ-ఈ కింద సర్టిఫికెట్లు జారీ చేయాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆదేశాలిచ్చారు.బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశం సుప్రీంకోర్టులో న్యాయపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం మరో రెండు ముస్లిం ఉపవర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించడం గమనార్హం.

డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని ఏపీ స్టేట్ మైనారిటీ కమిషన్ ఏపీ బీసీ సంక్షేమశాఖ బీసీ-ఈ కోటా కింద మహ్మద్ అబ్దుల్ అనే ఇంటి పేర్లు ఉన్నవారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చాయి.  ఈ మేరకు తహసీల్దార్లకు రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మహ్మద్ అబ్దుల్ అనే ఇంటి పేర్లు ఉన్నవారు బీసీ-ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆ సర్టిఫికెట్‌ను వారికి ఇవ్వాలని ఆదేశించారు.

ప్రభుత్వ నిర్ణయంతో విద్య ఉద్యోగావకాశాల్లో బీసీ-ఈ కోటా కింద నాలుగు శాతం రిజర్వేషన్లకు మహ్మద్ అబ్దుల్ అనే ఇంటి పేర్లు ఉన్న ముస్లింలు కూడా అర్హులవుతారు. కాగా ఏపీలో ఈ రెండు వర్గాల ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నారని అంటున్నారు. ఇప్పటివరకు బీసీ-ఈ కోటా కింద రిజర్వేషన్లు దూదేకుల సయ్యద్ మొదలైన ముస్లిం వర్గాలకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వీటికి అదనంగా అబ్దుల్ మహ్మద్ ఇంటి పేర్లు ఉన్నవారికి కూడా వర్తింపజేశారు.

దీంతో మమ్మద్ అబ్దుల్ ఇంటి పేర్లు ఉన్నవారికి కూడా దూదేకుల సయ్యద్‌లకు ఉన్నట్టే నాలుగు రిజర్వేషన్లలో వీరికి కూడా వాటా ఉంటుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కూడా వివరణ ఇచ్చారని చెబుతున్నారు.

గతంలో కాంగ్రెస్‌కు ఇప్పుడు వైఎస్సార్సీపీకి గట్టి ఓటు బ్యాంకుగా ఉన్నారు.. ముస్లింలు. ఈ వర్గాల్లో ఇప్పుడు మరింతమందికి రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని వైసీపీ ఆశిస్తోంది.