Begin typing your search above and press return to search.

స‌ర్దార్ వారసులు ఆ పేరు క్రేజును పెంచుతారా?

By:  Tupaki Desk   |   16 Aug 2022 7:33 AM GMT
స‌ర్దార్ వారసులు ఆ పేరు క్రేజును పెంచుతారా?
X
ఉద్దానం నేల‌ల‌పై  తిరుగాడిన స్వేచ్ఛా వికాసం ఒక‌టి ఇప్ప‌టికీ తెలుగు జాతిని న‌డిపిస్తోంది. శ్రీ‌కాకుళం కేంద్రంగా పుట్టిన ఉద్య‌మ సంప్ర‌దాయం ఒక‌టి నిరంత‌రం వెన్నంటే ఉండి ఇక్క‌డి వారిని ఉత్తేజ ప‌రుస్తోంది. స‌ర్దార్ అనే   పేరు   ఇప్ప‌టికీ  వినిపిస్తూ ఉంది. ఉద్దానం ప‌ల్లెల నుంచి దేశ రాజ‌ధాని వ‌ర‌కూ గౌతు ల‌చ్చ‌న్న అనే పేరు కు చిర కీర్తి ఉంది. ఆ కీర్తి ఇప్ప‌ట్లో త‌గ్గదు.కీర్తిని  విస్త‌రించే ప‌నులు కొన్ని ఆ ఇంటి వార‌సులు చేయాలి. అదే ఆయ‌న‌కు ఇచ్చేట‌టువంటి నివాళి కావొచ్చు.

లేదా ఆయ‌న పేరిట చేసిన సంస్మ‌ర‌ణ కూడా కావొచ్చు. ఆ విధంగా ఉద్దాన ప‌ల్లెల బాగుకు, ప్ర‌గ‌తికి, సంక్షేమానికి ఇంకా ఇంకొన్నింటికీ ఇవాళ గౌతు కుటుంబం చేయాల్సింది ఎంతో ! రాజీ లేని పోరాటాల కార‌ణంగానే అప్ప‌ట్లో ఆయ‌నకు అంత‌టి పేరు. మ‌ళ్లీ అంత‌టి పేరు కానీ ఖ్యాతి కానీ మ‌రొక‌రికి ఆ ప్రాంతంలో లేదు. అంత‌టి ఖ్యాతికి అర్హ‌త ఒక‌టి ఉండాలి. కీర్తిని అజ‌రామ‌రం చేసే ప్ర‌క్రియ ఒక‌టి త‌ప్ప‌క చేయాలి. ఈ రెండూ కూడా ఎవ‌రిలో ఉంటే వారే ల‌చ్చ‌న్నకు వార‌సులు. సిస‌లు వార‌సులు. అందుకు  అన్ని ప్రాంతాల వారూ ముఖ్యంగా ప్ర‌జాభ్యుద‌యం కోరుకుని ప‌నిచేసే వారు గొప్పగా అర్హులే ! వారే సిస‌లు వార‌సులు.

ఇవాళ స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న జ‌యంతి. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భాల్లో మ‌నం ఉన్నాం కనుక ఆయ‌న్ను స్మ‌రించి మంచి మార్పు దిశ‌గా అడుగులు వేయాల్సిన త‌రుణం ఇది. ఆజాదీ కా అమృతోత్స‌వ్ లో భాగంగానే కాదు అన్ని వేళ‌ల్లోనూ ఇటువంటి మ‌హ‌నీయుల స్మ‌రణ ఓ బాధ్య‌త. ఇప్ప‌టిదాకా ఎంద‌రెంద‌రో ఇదే బాట‌లో నడిచి కీర్తి అందుకున్నారు. సామాన్య కుటుంబాల‌కు గౌతు ల‌చ్చ‌న్న పేరు అతి సామాన్యంగా ప‌రిచ‌యం అయి అత్యున్న‌త రీతిలో ఆ వేళ స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కుటుంబం రాజ‌కీయంలో ఉన్నా ఉద్య‌మంలో ఉన్నా ఒకే విధంగా త‌మ నిబ‌ద్ధ‌త‌ను చాటుకుంద‌న్న‌ది ఆయ‌న అభిమానుల మాట.

ఎర్ర‌న్నాయుడు అనే దిగ్గ‌జ నేత‌కు స్ఫూర్తి, రాజకీయ గురువు ఆయ‌నే ! ఆయ‌న వారుసుడు గౌతు శ్యామ సుంద‌ర శివాజీ. ముక్కోపి అన్న పేరున్నా కూడా ఆయ‌న ఎర్ర‌న్న క‌లిసి ఉద్దానం బ్ర‌ద‌ర్స్ గా రాణించారు.

అటువంటి కుటుంబం నుంచి మ‌రిన్ని మంచి విలువలున్న త‌రం రావాల‌ని శ్రీకాకుళం ప్ర‌జానీకం కోరుకుంటోంది. ఉద్దానం వాకిట మేలు చేసే ప‌నులు రేప‌టి వేళ ఆ ఇంటిబిడ్డ గౌతు శిరీష చేయాల‌ని ఆశిస్తోంది. ఆ విధంగా ఆ ఆడ‌బిడ్డ అడుగులు మ‌రింత స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణికి చెంది ఉంటే చాలు. ప్రజాభ్యుద‌యం, వికాసం, చైత‌న్యం అనే ఉన్న‌త భావ‌జాల‌కు చేరువ‌యి మ‌రింత స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో ప‌నిచేస్తే మేలు.

ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌కు నివాళులు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏమ‌న్నారంటే.."స్వాతంత్య్ర సమరయోధుడిగా, రైతు ఉద్యమకారుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న జీవనయానం స్ఫూర్తిదాయకం. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో లచ్చన్న వంటి మహనీయుని తలుచుకుని ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆ దేశభక్తుని స్మృతికి నివాళులు" అని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.