మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ !

Fri May 13 2022 13:10:44 GMT+0530 (IST)

Religious conversion in Karnataka

కర్నాటకలో మత మార్పిడి నిషేధం పేరుతో ఆర్డినెన్సు జారీ చేసింది. ఉభయ సభల్లో మతమార్పిడి చట్టం చేసే అవకాశం అధికారపార్టీకి లేకపోవటంతో వేరే దారిలేక బసవరాజ బొమ్మై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అధికారపార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలమున్నా విధాన పరిషత్ లో బలం లేదు. అందుకనే పోయిన డిసెంబర్లో కానీ మొన్నటి మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టలేకపోయింది.వర్షాకాల సమావేశాలకు ఇంకా సమయం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఇపుడు ఆర్డినెన్సును పట్టుకొచ్చింది. మత మార్పిడి నిషేధ చట్టం అనే పేరుతో కాకుండా మత స్వేచ్ఛ పరిరక్షణ చట్టం పేరుతో తాజా ఆర్డినెన్స్ అమలవుతుంది. సరే ఈ చట్టంలో మత స్వేచ్చకు నిర్వచనాన్ని మతమార్పిడికి నిర్వచనం అతిక్రమిస్తే పడబోయే శిక్ష జరిమానా తదితరాలను ఆర్డినెన్సులో ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇలాంటి చట్టమే గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత అర్జంటుగా మతమార్పిడి నిషేధ చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నాయి ?

ఎందుకంటే ఒక వర్గం మరో వర్గానికి చెందిన యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నట్లు చాలా ఆరోపణలున్నాయి. యూపీ కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మత మార్పిడులు జరుగుతున్నట్లు గోల జరుగుతోంది.

ఇదే సమయంలో లవ్ జిహాద్ పేరుతో ఒక వర్గానికి చెందిన యువకులు మరో వర్గానికి చెందిన అమ్మాయిలను ప్రేమ పేరుతో ఆకర్షించటం తర్వాత వారిని తమ మతంలోకి మారుస్తున్నట్లు బయటపడ్డాయి. వివాహానికి ముందో తర్వాత అమ్మాయిలను మతమార్పిడులు చేయించి ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థల్లో చేర్పిస్తున్నట్లు కొన్ని ఘటనలు  బయటపడ్డాయి.

దీంతో ఇలాంటి బలవంతపు మత మార్పిడులను నియంత్రించేందుకు ముందు యూపీ ఇపుడు కర్నాటక ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే చట్టాలు తెచ్చిన రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావటమే గమనార్హం. చట్టాలు తెచ్చిన తర్వాత మత మార్పిడులు తగ్గుతాయా అనేది చూడాలి.