Begin typing your search above and press return to search.

దసరా నుంచే ఇక రిజిస్ట్రేషన్లు.. అంతా ఆన్ లైన్?

By:  Tupaki Desk   |   20 Oct 2020 10:50 AM GMT
దసరా నుంచే ఇక రిజిస్ట్రేషన్లు.. అంతా ఆన్ లైన్?
X
తెలంగాణలో అవినీతి లేని పారదర్శక పాలనకు బీజం పడుతోంది. దసరా నుంచే ‘ధరణి’ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా అరగంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యి పట్టాదారు పాసుపుస్తకం చేతికందనుంది.

రిజిస్ట్రేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్ డేషన్, మ్యూటేషన్( హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూహక్కులు, పాసుపుస్తకాల చట్టం-2020తో ఇది సాధ్యం కానుంది.

ఇక నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ ఆఫీసుల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

ఈ దసరా పండుగ నుంచి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిర్వహించనుంది. అంతా ఆన్ లైన్ లోనే జరుగనుంది. స్టాట్ బుకింగ్, దరఖాస్తులు పూర్తి, సమాచార క్రయ, విక్రయాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూశాఖ ఈ ధరణి పోర్టల్ ను రూపొందించింది.

ఇక ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్లతో పనిలేదు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం తహసీల్ కు వెళ్లేలా ఈ ప్రక్రియను తీర్చిదిద్దారు.

ప్రస్తుతం ఈనెల 25వ తేది నుంచి సాగుభూముల రిజిస్ట్రేషన్లు తహసీల్ కార్యాలయాల్లో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, గిఫ్ట్ డీడీ, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజిస్ట్రేషన్లను దసరా నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.