Begin typing your search above and press return to search.

బాబు ఐడియాను పట్టించుకోవడం లేదట..

By:  Tupaki Desk   |   21 May 2019 6:36 AM GMT
బాబు ఐడియాను పట్టించుకోవడం లేదట..
X
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అని వెనుకటికి ఎవరో అన్నారట.. ఇప్పుడీ సామెత టీడీపీ అధినేత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఇప్పటికే ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. దేశంలో మరోసారి బీజేపీదే అధికారమని తేల్చిచెప్పేశాయి. ఆ ఫలితాలు చూసి మొఖం మీద నెత్తురు చుక్కలేకుండా ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలు - కాంగ్రెస్ దిగాలుగా ఉన్నాయి.కానీ బాబు గారు మాత్రం ఆశ చావకుండా ఇంకా వారిని కూడగట్టే ప్రయత్నాలు చే్తున్నారు. మమతా బెనర్జీ - మాయావతి - అఖిలేష్ అంటూ ఇలా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాయి. అయినా వారి నుంచి పెద్దగా స్పందన అయితే రావడం లేదు.

తాజాగా బెంగాల్ సీఎం మమతను కలిసిన చంద్రబాబు ఒక్కటే ప్రతిపాదన పెట్టాడట.... దేశంలోని కాంగ్రెస్ కు మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతిని కలవాలని ఒత్తిడి తెచ్చాడట.. లేకపోతే దేశంలో ఒకవేళ హంగ్ వస్తే బీజేపీనే రాష్ట్రపతి అహ్వానిస్తాడట.. గద్దెనెక్కగానే మోడీ ప్రాంతీయ పార్టీలకు గాలం వేసి వారిని బీజేపీ కూటమిలో చేర్చి మరో ఐదేళ్లు అధికారం చెలాయిస్తాడని బాబు వారి వద్ద ఆందోళన వ్యక్తం చేశాడట.. మన ఎంపీలను కూడా లాగేసి విష సంప్రదాయానికి తెరతీస్తాడని బాబు ప్రస్తావించాడట..

అనంతరం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు.. మాయవతి, అఖిలేష్, కాంగ్రెస్ వద్ద కూడా ఇదే పాట పాడినట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రపతిని కలవాల్సిందేనని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే ఓటమి భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతీయ పార్టీలు దాని గురించి అస్సలు ఆలోచించే పరిస్థితిలో లేవని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

అయితే చంద్రబాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అమరావతిలోనూ ప్రాంతీయ పార్టీలందరం రాష్ట్రపతిని కలుస్తామని.. మోడీ గద్దెనెక్కకుండా తమను పరిగణలోకి తీసుకోవాలని కోరుతామని చెప్పడం విశేషం.

చంద్రబాబు రాష్ట్రపతిని కలవాలన్న ప్రతిపాదనకు లెఫ్ట్ పార్టీలు కూడా సిద్ధంగా లేవు. దేశంలో మోడీ వస్తాడని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కుండబద్దలు కొట్టిన వేళ ఇదంతా వృథాప్రయాస అని మే 23 తర్వాతే ఆలోచిద్దామనే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు మమత, మాయా, అఖిలేష్,సహా అన్ని పార్టీలున్నాయి. అందుకే బాబు ఐడియాను చెత్తబుట్టలో పడేయడానికి వారంతా సిద్ధం అయినట్టు తెలిసింది.