Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ షాక్ తో చస్తుంటే.. థర్డ్ వేవ్ మాటతో వణికిస్తున్నారుగా?

By:  Tupaki Desk   |   21 April 2021 3:29 AM GMT
సెకండ్ వేవ్ షాక్ తో చస్తుంటే.. థర్డ్ వేవ్ మాటతో వణికిస్తున్నారుగా?
X
కరోనా మొదటి దశ వచ్చింది వెళ్లింది. వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ.. అది చేయాల్సిన రచ్చ చేసి వెళ్లింది. మొదటి దశ పూర్తైన నేపథ్యంలో తగ్గిన కేసుల్ని చూసి సంతోషానికి గురి కావటమే కాదు.. కరోనాను జయించామంటూ భారీ ప్రకటనలు చేశారు. ప్రజలు సైతం ఇదే నిజమని నమ్మారు. మొదటి దశ తర్వాత రెండో దశ అనేది ఉంటుందని.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు ఉన్నా.. దాని గురించి మాట్లాడిన వారు.. హెచ్చరించినోళ్లు తక్కువే.

కరోనాను లైట్ తీసుకున్న వేళ.. కాచుకొని కూర్చున్న మహమ్మారి సెకండ్ వేవ్ తో తానేమిటో చూపిస్తోంది. చూస్తుండగానే దేశం మొత్తం వ్యాపించటమే కాదు.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరోగ్య వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. తాజా పరిణామాల్ని చూస్తున్నవారికి మొదటి దశ పెద్ద వేవ్ కాదని.. సెకండ్ వేవ్ భారీ సవాలును విసిరినట్లుగా చెప్పాలి. టీకాల విషయంలో కేంద్రం అనుసరించిన విధానాలు సైతం సెకండ్ వేవ్ ఈ స్థాయిలో విరుచుకుపడేందుకు కారణమని చెప్పాలి.

తాజాగా నడుస్తున్న సెకండ్ వేవ్ జూన్ నెలాఖరు వరకు ఉంటుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతన్నది రానున్న రోజుల్లో తేలనుంది. తాజాగా.. థర్డ్ వేవ్ గురించి అంచనాలు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న వేళ.. థర్డ్ వేవ్ గురించి పక్కా అంచనాల్ని సిద్ధం చేయకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. టీకాను మరో ఆర్నెల్ల లోపు దేశంలోని 60 శాతానికి పైగా ప్రజలకు అందించకుంటే.. మరో ఆర్నెల్లలో మూడో వేవ్ తప్పదన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న సెకండ్ వేవ్.. మే రెండో వారానికి పీక్ స్టేజ్ కు వస్తుందన్న అంచనాలో ఉన్నారు. అప్పటివరకు కేసుల నమోదు ముందుకే తప్పించి.. వెనక్కిపడవంటున్నారు. మే రెండో వారం తర్వాత మాత్రమే.. కేసుల నమోదులో స్థిరత్వం చోటు చేసుకొని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం థర్డ్ వేవ్ ఈ నవంబరు.. డిసెంబరుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అప్పటికి.. మెజార్టీ ప్రజలు టీకా వేసుకోగలిగితే.. మూడో వేవ్ ను సమర్థంగా ఎదుర్కొనే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.