రేవంత్ సంచలనం..హస్తం పార్టీ అంతు చిక్కనిదేనట!

Wed Sep 18 2019 22:22:09 GMT+0530 (IST)

టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దుకుని - ఆపై గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు తత్వం బాగానే బోధపడినట్టుంది. అందుకే కాబోలు... హస్తం పార్టీ అంతు చిక్కని పార్టీనేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఎక్కడో కాదండోయ్... తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది. టీడీపీలో ఉండగా వరుస విజయాలతో ఓ రేంజి నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి... హస్తం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే పరాజయాన్ని చవిచూశారు. అయితే ఆ పరాజయంతో కుంగిపోకుండా.. సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరీ నుంచి సత్తా చాటి ఎమ్మెల్యే హోదా నుంచి ప్రమోషన్ పొందినట్టుగా ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టేశారు.ఇంతదాకా బాగానే ఉన్నా... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ చిక్కిపోతోంది. టీఆర్ ఎస్ తనదైన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని ఊపిరి సలపనీయడం లేదు. ఈ క్రమంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పాదయాత్ర ద్వారా పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని రేవంత్ చెబితే... అధిష్ఠానం నుంచి సింగిల్ మాట కూడా వినిపించలేదు. సరే....ఇంకో రాయేద్దామనుకున్న రేవంత్... ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన యురేనియం తవ్వకాలే ఆధారంగా ఓ సరికొత్త పోరాటానికి తెర తీస్తానని కూడా ప్రతిపాదించారు. ఈ మాటకూ అధిష్ఠానం నుంచి సైలెన్స్ ఆన్సరైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తత్వం ఏమిటో రేవంత్ కు బాగానే అర్థమైనట్టు ఉంది. అందుకే కాబోలు... కాంగ్రెస్ పార్టీ అంతు చిక్కని పార్టీనే అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన సందర్బంగా అసెంబ్లీలో విద్యుత్ పై జరుగుతున్న కీలక చర్చలో తమ పార్టీ సభ్యులు లేని వైనాన్ని చూసి షాక్ తిన్నారు. అదే విషయాన్ని తనను లాబీల్లో కలిసిన మీడియా ప్రతినిధుల ముందట రేవంత్ ఓపెన్ చేశారు. కీలకమైన విద్యుత్ పై చర్చ జరుగుతుంటే... తమ పార్టీ సభ్యులు ఎక్కడికెళ్లారో కూడా అర్థం కావడం లేదని ఆయన కాస్తంత నర్మగర్భంగానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీ వ్యవహార సరళిపై తనదైన శైలి కామెంట్లు చేసిన రేవంత్... పార్టీ అధిష్ఠానం ఎవరిని అందలం ఎక్కిస్తుందో - ఎవరి మెడపై కత్తి పెడుతుందో కూడా అర్థం కావడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీ తత్వం ఏమిటో ఇప్పటికైనా రేవంత్ కు అర్థమైందిలే అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.