ఆర్టీసీ ఆస్తులే జగన్..కేసీఆర్ మధ్య దూరాన్ని పెంచాయా?

Wed Nov 20 2019 20:00:01 GMT+0530 (IST)

Reason behind Jagan Maintain Distance with KCR

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉప్పు..నిప్పు అన్నట్లు పరిస్థితి ఉండేది. బాబుతో సంబంధాలు చెడిపోవటానికి కారణం ఆయన తీరే ప్రధాన కారణంగా చెబుతారు. కట్ చేస్తే.. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ సీఎంగా జగన్ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చక్కటి బంధం ఉన్నట్లుగా కొన్ని సమావేశాలు సాగాయి.ఈ మధ్య వరకూ అంతా బాగుందన్న భావన కలిగించినా.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య దూరాన్ని పెంచుతున్న భావన కలిగిస్తోంది. అయితే.. విధానపరమైన నిర్ణయాలు.. రాష్ట్ర ప్రయోజనాలే తప్పించి మరింకేమీ లేవన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం సంచలనంగా మారింది.

ఎందుకిలా? ఇలాంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు తీసుకుందన్నది ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. మరెవరూ కూడా పెదవి విప్పలేదు. ఇంతకీ.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన మనస్పర్థలకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఎవరికి వారు వారి.. వారి రాష్ట్రాల ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలే ఇలాంటి పరిస్థితికి కారణమంటున్నారు.

తాజాగా ఇరువురు అధినేతల మధ్య దూరానికి కారణం ఆర్టీసీ ఆస్తులన్న మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు కావొస్తున్నా.. ఇప్పటివరకూ ఆర్టీసీ ఆస్తుల విభజన పూర్తి కాలేదు. ఏపీఎస్ ఆర్టీసీకే గుర్తింపు ఉంది కానీ టీఎస్ ఆర్టీసీకి  గుర్తింపు లేదన్న మాట ఇటీవల బయటకు రావటం తెలిసిందే. ఒక అవగాహనతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీలు పని చేస్తున్నాయి.

అయితే.. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్ ఆర్టీసీకి హైదరాబాద్ లోనూ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆస్తులు భారీగా ఉన్నాయి. భవనాలు.. ఖాళీ స్థలాలు లాంటివి వివిధ రూపాల్లో ఉన్నాయి. విభజన లెక్కల ప్రకారం 58-42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది. కానీ.. అలా జరగలేదు. ఈ లెక్కల్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీకి రూ.16వేల కోట్ల ఆస్తులు తమకు చెందాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ఈ వాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్ లో ఆర్టీసీకి 11 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ భవనాలు.. స్థలాల రూపంలోనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంది. ఏపీ అధికారులు వేసిన అంచనా ప్రకారం ఆర్టీసీ ఆస్తుల విలువ ఏకంగా రూ.35వేల కోట్లు. అందులో రూ.16వేల కోట్లు తమ వాటా కింద రావాలంటున్నారు.

ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ షేర్ మాత్రమే ఇస్తాం తప్పించి మరింకేమీ ఇవ్వమని వాదిస్తోంది. ఈ భవనాన్నినిర్మించినప్పుడు దీని విలువ రూ.76 కోట్లు. దాన్లో వాటా ఇస్తాం తప్పించి.. మిగిలిన ఆస్తుల్ని ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇదే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య విధానపరమైన దూరాన్ని పెంచినట్లుగా చెబుతున్నారు.