Begin typing your search above and press return to search.

బీజేపీ నుంచి నితీష్ కుమార్ విడిపోయింది.. అందుకేనా?

By:  Tupaki Desk   |   11 Aug 2022 9:39 AM GMT
బీజేపీ నుంచి నితీష్ కుమార్ విడిపోయింది.. అందుకేనా?
X
బిహార్ లో బీజేపీతో రెండేళ్ల స్నేహాన్ని వదులుకుంటూ ఆ ప్ర‌భుత్వం నుంచి ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేసి బ‌య‌ట‌కొచ్చిన సంగ‌తి తెలిసిందే. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ తో చేతులు క‌లిపిన నితీష్ ఏకంగా ఎనిమిదోసారి బిహార్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక లాలూప్ర‌సాద్ యాదవ్ కుమారుడు, ఇప్ప‌టిదాకా బిహార్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న తేజ‌స్వీ యాద‌వ్ ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇక తేజ‌స్వీ సోద‌రుడు, లాలూ మ‌రో కుమారుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టే వీలుంది.

కాగా, నితీష్ కుమార్ ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని, ఆయ‌న‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎంపిక చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే బీజేపీ సంకీర్ణ స‌ర్కారు నుంచి త‌ప్పుకున్నార‌ని బిహార్ కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఎంతోమంది జేడీయూ నేత‌లు ఇది నిజ‌మేనా బీజేపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించార‌ని ఆయ‌న తెలిపారు.

కాగా సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్య‌ల‌ను బిహార్ సీఎం నితీష్ కుమార్ తోసిపుచ్చారు. ఈ వ్యాఖ్య‌లు పెద్ద జోక్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వుల‌కు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌కే త‌మ పార్టీ జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ మ‌ద్ద‌తిచ్చింద‌ని నితీష్ కుమార్ గుర్తు చేశారు. ఇందుకోసం త‌మ పార్టీ ప్ర‌త్యేకంగా స‌మావేశాలు ఏర్పాటు చేసింద‌ని.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ద్రౌప‌ది ముర్ముకు, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ కు మ‌ద్ద‌తిచ్చామ‌ని నితీష్ కుమార్ అంటున్నారు.

ఉప‌రాష్ట్ర‌ప‌తి కావాల‌నే కోరికే త‌న‌కు లేద‌ని నితీష్ కుమార్ తేల్చిచెప్పారు. నేను ఉప‌రాష్ట్ర‌ప‌తిని కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఒక బీజేపీ నేత చెప్ప‌డం విడ్డూర‌మ‌ని, ఇది పెద్ద జోక్ అని నితీష్ సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.

కాగా జేడీయూని విచ్ఛిన్నం చేయ‌డానికి, మ‌హారాష్ట్ర‌లో మాదిరిగానే బిహార్ లోనూ ఏకనాథ్ షిండేలాంటి వ్య‌క్తుల‌ను ప్రోత్స‌హించ‌డానికి బీజేపీ కుట్ర‌లు చేస్తోంద‌ని నితీష్ కుమార్ ఆరోపించారు. 2024 ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భుత్వం రాకుండా విప‌క్షాలు అన్నీ ఏకం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2025 జ‌రిగే బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, 2024లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ అధికారంలోకి రాద‌ని.. ఈ మేర‌కు అన్ని పార్టీలు క‌ల‌సిక‌ట్టుగా కృషి చేస్తాయ‌ని నితీష్ చెబుతున్నారు.

మ‌రోవైపు నితీష్ కుమార్ కు, ఊస‌ర‌వెల్లికి తేడా లేద‌ని బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-జేడీయూ కూట‌మికి అధికారాన్ని ఇచ్చార‌ని గుర్తు చేస్తోంది. ఆ తీర్పును నితీష్ ఉల్లంఘించాడ‌ని మండిప‌డుతోంది. బీజేపీతో పొత్తును వ‌దులుకుని ప్ర‌త్య‌ర్థి పార్టీ ఆర్జేడీతో చేతులు క‌లిపిన‌ నితీష్ లాంటి రాజ‌కీయ అవ‌కాశ‌వాదుల‌కు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతార‌ని అంటోంది.