Begin typing your search above and press return to search.

అవును.. అదానీ ర్యాంకు తగ్గింది.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   25 Jan 2023 9:57 AM GMT
అవును.. అదానీ ర్యాంకు తగ్గింది.. కారణం ఇదే!
X
ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలవటమే కాదు.. టాప్ 5 వరకు వచ్చేసిన భారతీయుడిగా గుర్తింపు పొందారు అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. ఆయన టార్గెట్ చేసిన ఏ వ్యాపార సంస్థ అయినా సరే ఆయన చేతుల్లోకి రావాల్సిందే.

అందుకు అవసరమైన అన్ని విద్యల్ని ప్రయోగించే అలవాటు ఆయన సొంతం. మొన్నటివరకు ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన.. తాజాగా వెల్లడించిన బ్లూమ్ బర్గ్ సంపన్నుల జాబితా ప్రకారం చూస్తే..నాలుగో స్థానానికి తగ్గారు.

దీనికి కారణం ఆయన సంపద విలువ 683 మిలియన్ డాలర్ల మేరకు తగ్గటమే. ఇటీవల ఆయన షేర్ల విలువ కొంత ఒడిదుడుకులకులోను కావటమే దీనికి కారణంగా చెప్పొచ్చు. భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ఆయన..నికర సంపద విలువ 120 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి చేరుకోవటంతో మూడో స్థానానికి అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నిలిచారు.

ఇక.. అగ్రస్థానం విషయానికి వస్తే.. సామాన్యులకు పెద్దగా పరిచయం లేని ఫ్రాన్స్ విలాస ఉత్పత్తుల సంస్థ లూయి విటోస్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. 188బిలియన్ డాలర్లుగా ఆయన సంపదను లెక్కించారు. ఇక.. టాప్ టెన్ కుబేరుల్లో ఒకరిగా నిలిచిన రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తాజాగా పన్నెండో స్థానంలో నిలిచారు. ఆయన 84.7 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ టెన్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రతి రోజూ న్యూయార్క్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత గణాంకాల్ని సవరిస్తుంటారు. షేరు మార్కెట్ ధర ఆధారంగా ఈ లెక్కింపు ఉంటుంది. తాజాగా చూస్తే.. మొదటి స్థానంలో 188 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిస్తే.. రెండో స్థానంలో ఎలాన్ మస్క్ 145 బిలియన్ డాలర్లతో నిలిచారు.

మూడో స్థానంలో జెఫ్ బెజోస్ 121 బిలియన్ డాలర్లుగా లెక్క తేల్చారు. నాలుగో స్థానంలో గౌతమ్ అదానీ (120 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో బిల్ గేట్స్ (111 బిలియన్ డాలర్లు) నిలిచారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.