Begin typing your search above and press return to search.

కరోనా కేసులకు ఇవే కారణమా ?

By:  Tupaki Desk   |   20 Jan 2022 5:50 AM GMT
కరోనా కేసులకు ఇవే కారణమా ?
X
ఒక్కసారిగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో సుమారుగా 10 వేల కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. చాలా కాలం తర్వాత ఇంత భారీ ఎత్తున కేసులు నమోదవ్వటం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో ఒక్కసారిగా వేలాది కేసులు పెరగటానికి ప్రధాన కారణం ఏమిటి ? ఏమిటంటే గోదావరి జిల్లాల్లో జరిగిన కోడి పందేలు, చిత్తూరు జిల్లాలో జరిగిన జల్లికట్టు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కోడిపందేలను ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువగా జరిగాయి. మూడు రోజుల పాటు వరసగా కోడి పందేలు జరగటంతో వేలాది మంది జనాలు ఒకేచోట గుమిగూడారు. ఇక్కడ పేరుకు మాస్కులు వేసుకోవాలని చెప్పారు కానీ ప్రత్యక్షంగా చాలామంది వేసుకోలేదు. మాస్కులే సరిగా వేసుకోలేదంటే ఇక భౌతిక దూరం పాటించటం పూర్తిగా గాలికొదిలేశారు.

పందేల బరుల్లో గుమిగూడిన వేలాది మందిలో ఎవరికి కరోనా వైరస్ ఉందో ఎవరికి లేదో కూడా ఎవరికీ తెలీదు. అలాంటపుడు ఒకేసారి ఇన్ని వేలమంది ఉభయగోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు ఒకే చోట ఉండటంతో సమస్య పెరిగిపోయింది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలోని చిత్తూరు ప్రాంతంలోను, రంగంపేట ప్రాంతంలోను మూడు రోజులు జల్లికట్టు జరిగింది. ఈ జల్లికట్టులో పాల్గొనేందుకు, చూసేందుకు వేలాదిమంది ఒకేచోట చేరారు. కేసుల సంఖ్య పెరిగిపోవటానికి ఇది కూడా కారణమైంది.

ఇక తిరుపతిలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం దర్శనానికి వచ్చే వారి వల్ల కూడా సమస్య పెరిగిపోయింది. కోవిడ్ సర్టిఫికెట్ ఉన్న వారినే తిరుమలకు అనుమతిస్తామని అధికారులు చెప్పినా ఆచరణలో నూరుశాతం సాధ్యం కాలేదు. ఇక జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు లాంటి దేవాలయాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ కారణంగా కూడా కేసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలోనే సుమారుగా 6 వేల కేసులు రికార్డవ్వటమే కేసుల తీవ్రతకు నిదర్శనం.