తప్పు టీడీపీది..నిందలు మాత్రం జగన్ పై!

Thu Jun 28 2018 15:10:24 GMT+0530 (IST)

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తనపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలతో తన మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అందుకు ఉన్న పళంగా పదవికి రాజీనామా చేశానని పరకాల ప్రచారం చేసుకున్నారు. కేవలం జగన్ అన్న మాటల వల్లే తన అమూల్యమైన సేవలను నవ్యాంధ్ర ప్రజలు కోల్పోయారని ప్రెస్ మీట్ లు పెట్టి మరీ సెంటిమెంట్ డైలాగులు కొట్టారు. అయితే ఆ రాజీనామా డ్రామా తెర వెనుక విస్తుపోయే నిజాలు వెల్లడైన సంగతి తెలిసిందే. మరో 15 రోజుల్లో తన పదవీ కాలం ముగియనుందని తెలిసిన ప్రభాకర్....రాజీనామా డ్రామాతో ఏపీ ప్రజలను బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా బుక్కయిన విషయం విదితమే. అసలు పరకాల రాజీనామా డ్రామా వెనుక ఏపీ సీఎం చంద్రబాబు చాణక్య వ్యూహం ఉందని పుకార్లు వచ్చాయి. బీజేపీ–టీడీపీ చీకటి ఒప్పందాన్ని కప్పిబుచ్చాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ మాస్టర్ ప్లాన్ వేశారట. బీజేపీతో టీడీపీకున్న సత్సంబంధాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ఈ వ్యూహ రచన చేశారు. అయితే ఆ తర్వాత  పరకాల అపాయింట్ మెంట్ లెటర్ బయటకు రావడంతో బాబు గారి బాగోతం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ఆ రాజీనామా డ్రామా వెనుక అసలు కథ వేరే ఉందని తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పరకాల రాజీనామాకు జగన్ వ్యాఖ్యలు అసలు కారణం కాదని - కొందరు టీడీపీ నేతలు అన్న వ్యాఖ్యల కారణంతోనే పరకాల రాజీనామా చేశారని తెలుస్తోంది.ప్రస్తుతం రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో....వారిపై ఏదో ఒక బురద జల్లి....పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో ఆ బురదను వారు కడుక్కునే లోపు తీవ్రస్థాయిలో విష ప్రచారం చేస్తున్నారు. పరకాల రాజీనామా వ్యవహారంలో కూడా అదే జరిగింది.  కేంద్రానికి తన సతీమణి నిర్మల సీతారామన్ ద్వారా కీలక సమాచారం అందిస్తున్నానని - టీడీపీ-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని జగన్ ఆరోపించారు. అయితే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ....జగన్ వ్యాఖ్యలు చేసినా చాలా కాలం తర్వాత గానీ పరకాలకు రాజీనామా చేయాలనిపించకపోవడం శోచనీయం. అయితే పరకాల రాజీనామాకు అసలు కారణం వేరే ఉందని తాజాగా పుకార్లు వస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని తన భార్య ద్వారా పరకాల కేంద్రానికి చేరవేస్తున్నారని - ఇంకా ఆయనను పదవిలో కొనసాగించడం అనవసరమని కూడా చంద్రబాబుకు ఉప్పందించారట. అయితే అప్పటికే జగన్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్న పరకాల....సొంతపార్టీ నేతల వ్యాఖ్యలతో మనస్తాపం చెందారట. తన బాధను చంద్రబాబుకు కూడా చెప్పుకున్నారట. అయితే ఆ నేతల పేర్లు తనకు చెప్పాలని.. తాను వారిని పిలిపించి మందలిస్తానని పరకాలకు చంద్రబాబు నచ్చజెప్పారట. అయితే అప్పటికే హర్ట్ అయిన పరకాల....రాజీనామాకే మొగ్గు చూపి ఆ నెపం జగన్ పై నెట్టారు. ఇంకేముందు జగన్ పై ఎపుడు బురదజల్లుదామా అని కాచుకు కూర్చున్న చంద్రబాబు...ఆయన కొమ్ముకాచే ఎల్లో మీడియా.....ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్ కు అంటగట్టారు.