తమిళ గడ్డపై జిన్ పింగ్..మోదీ మార్కు ఆతిధ్యమే రీజనంట!

Thu Oct 10 2019 22:48:30 GMT+0530 (IST)

Reason Behind Modi And Jinping Meeting at Mahabalipuram

భారత - చైనా దేశాధినేతల మధ్య శిఖరాగ్ర సమావేశం శుక్రవారం తమిళనాడులోని ప్రాచీన నగరం మహాబలిపురం వేదికగా జరుగుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగనున్న ఈ భేటీ శుక్రవారంతో పాటు శనివారం కూడా కొనసాగనుంది. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ భేటీ ద్వారా చైనా - భారత్ ల మధ్య సంబంధాలు ఏమాత్రం బలపడతాయన్న విషయంపై ఓ మోస్తరు చర్చ నడుస్తున్నా... దేశ రాజదాని ఢిల్లీ - నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లు ఉండగా... తమిళనాడు రాజధాని చెన్నైకి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురంలోనే ఎందుకు జరుగుతోందన్న విషయంపై అంతకంటే ఆసక్తికరమైన చర్చలకు తెర లేసింది.మోదీ - జిన్ పింగ్ ల మధ్య జరగనున్న చర్చల ద్వారా ఇరు దేశాలకు సంబంధించి ఏమేం ప్రయోజనాలు ఉన్నాయన్న విషయంపై అధికార వర్గాలకు ఓ మోస్తరు అవగాహన ఉన్నా.. సాధారణ జనానికి మాత్రం అంతగా అవగాహన లేదనే చెప్పాలి. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాలు... ఈ చర్చల ద్వారా మరింత బలోపేతం అవడం అయితే ఖాయమే గానీ... ఏఏ అంశాల్లో ఇరు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు కుదరనున్నాయన్న విషయంపైనా ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితే. అంతేకాకుండా నిత్యం మనపై కాలు దువ్వుతున్న దాయాదీ దేశం పాకిస్థాన్ కు వత్తాసు పలుకుతున్న చైనా వైఖరిలో ఈ చర్చల ద్వారా పెద్దగా మార్పు వచ్చే అవకాశాలు కూడా లేవన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ఇక ఆర్థిక అంశాల పరంగా చూసినా ఇరు దేశాల మధ్య మరింత పోటీ పెరిగితే... ఇరు దేశాలకు బాగుంటుంది. సో... ఆర్థిక పరమైన సహకారం కూడా ఇరు దేశాల మధ్  మొగ్గ తొడిగే అవకాశాలు అంతంత మాత్రమే.

మరి జిన్ పింగ్ తో భేటీ కోసం మోదీ చెన్నై సమీపంలోని మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడేమీ పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో చైనా అధ్యక్షుడి హోదాలోనే జిన్ పింగ్ భారత్ వస్తే... ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశమున్నా మోదీ... ఆయనను తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు తీసుకెళ్లారు. సబర్మతీ నది ఒడ్డున జిన్ పింగ్ తో మోదీ చర్చలు నడిపారు. ఆ తర్వాత ఫ్రాన్స్ - జపాన్ తదితర దేశాధినేతలు వచ్చిన సమయంలోనూ ఢిల్లీలో కాకుండా వారితో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనే భేటీ అయ్యేందుకు మోదీ ఆసక్తి చూపారు. తనదైన మార్కు ఆతిథ్యాన్ని ఇతర దేశాధినేతలకు రుచి చూపించేందుకే మోదీ ఈ తరహా అవుట్ సైడ్ ఢిల్లీ ట్రీట్ లు ఇస్తున్నారని చెప్పక తప్పదు.

ఇందులో భాగంగానే ఇప్పుడు భారత్ కు వస్తున్న జిన్ పింగ్ కు దక్షిణ భారత్ లోని అత్యంత అరుదైన ప్రాచీన కట్టడాలను - ఆచార వ్యవహారాలను పరిచయం చేసేందుకే మోదీ మహాబలిపురాన్ని ఎంచుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా దక్షిణాదిన బీజేపీని బలోపేతం చేసే దిశగా తనదైన శైలి ప్లాన్లు వేస్తున్న మోదీ... ఇతర దేశాధినేతలను తమ వద్దకు కూడా మోదీ తీసుకువస్తునర్నారన్న భావనను దక్షిణ భారతీయుల్లో కల్పించేందుకే మోదీ ఈ తరహా వ్యూహాలు అమలు చేస్తున్నారన్న కొంగొత్త విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఓ దేశాధినేతను ప్రదాని నరేంద్ర మోదీ... నేరుగా దక్షిణాదికి తీసుకువస్తున్న విషయం మాత్రం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు.